కొత్త జాతీయ పార్టీని ప్రకటించబోతున్న కేసీయార్ పెద్ద పార్టీల్లో దేనితోను కలవదలచుకున్నట్లు లేదు. ఎందుకంటే ఆదివారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ తమకు బీజేపీ మాత్రమే ప్రత్యర్ధిగా చెప్పారు. జాతీయ స్ధాయిలో బీజేపీతో మాత్రమే పోటీ పడాలని కేసీయార్ చెప్పటంలో రెండు అనుమానాలు మొదలయ్యాయి. మొదటిదేమో తాను ఎవరితోను కలవదలచుకోలేదన్నది. ఇక రెండోదేమో ఏ పెద్ద పార్టీ కూడా కేసీయార్ తో చేతులు కలపటానికి సిద్ధంగా లేదని.
ఈ అనుమానానికి కారణం ఏమిటంటే బీజేపీ కాకుండా మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ తో కేసీయార్ ఎలాగూ కలవలేరు. అయితే హస్తం పార్టీతో కలవటానికి చాలా పార్టీలు సానుకూలంగానే ఉన్నాయి. ఇదే కేసీయార్ కు పెద్ద సమస్యగా మారింది. తెలంగాణాలో ఉన్న సమస్య కారణంగా కాంగ్రెస్ తో కలవటానికి కేసీయార్ సిద్ధంగా లేరు. బలమైన ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి కానీ బీజేపీ, కాంగ్రెస్ లో ఏదో ఒకదానితో కలవాల్సిందే.
బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్ తో కలవకుండా జాతీయ స్ధాయిలో రాజకీయం చేయాలంటే సాధ్యం కాదు. ఈ సత్యం తెలుసుకోబట్టే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా వేరే దారి లేక చివరకు కాంగ్రెస్ తో కలిసి పనిచేయటానికి రెడీ అవుతున్నారు. కర్నాటకలో జేడీఎస్ తప్ప మరే పార్టీ కూడా కేసీయార్ తో కలిసి నడవటానికి అంతగా సానుకూలంగా ఉన్నట్లు లేదు. ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ, కేజ్రీవాల్, నితీష్ కుమార్, స్టాలిన్ తో పాటు శరద్ పవార్, తేజస్వీ యాదవ్, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు చాలామందితో మాట్లాడినా పెద్దగా వర్కవుటైనట్లు లేదు.
అందుకనే బీజేపీతోనే తమకు అసలైన పోటీగా ప్రకటించారు. కాంగ్రెస్ తో కుదరనపుడు కాంగ్రెస్ కు సానుకూలంగా ఉన్న పార్టీలేవీ కేసీయార్ తో కలిసే అవకాశాలు దాదాపు ఉండవు. సో కొంతకాలంపాటు జాతీయ స్ధాయిలో ఒంటరిగానే పోరాటం చేయాల్సుంటుంది. అది కూడా వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి వస్తేనే సుమా.