ఉత్త‌రాంధ్ర‌ ప్ర‌జ‌లు రాజ‌ధాని రైతులు కాళ్లు విర‌గ్గోడతారు

ఏపీ రాజ‌ధాని అమ‌రావతి రైతుల‌పై వైసీపీ మంత్రులు, నాయ‌కులు అదే అక్క‌సు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. కాకినాడ దిశ‌గా సాగుతున్న రైతుల మ‌హాపాద‌యాత్ర 2.0ను అడ్డుకోవాల‌ని.. సాక్షాత్తూ.. మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. నిజానికి మంత్రిగా బాధ్య‌తాయుత స్థానంలో ఉన్న ఆయ‌న అలా వ్య‌వ‌హ‌రించ‌డం.. వివాదానికి దారితీసింది. అయినా.. ఏమాత్రం వెనుక‌డుగు వేయ‌డం లేదు. ఇక‌, తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదే రేంజ్‌లో వ్యాఖ్య‌లు చేశారు.

అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపై ఎమ్మెల్సీ దువ్వాడ ఘాటుగా స్పందించారు. ఉత్తరాంధ్రలో పాదయాత్ర నిర్వహించకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఏదైనా దుష్పరిణామం జరిగితే దానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని అన్నారు. పాదయాత్ర చేస్తున్న వారు అసలు రైతులే కాదని.. వారంతా పెయిడ్‌ ఆర్టిస్టులంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రుల మనోభావాలు దెబ్బతీసేలా యాత్రలు చేస్తే సహించేదిలేదన్నారు.

చంద్రబాబు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అచ్చెన్నాయుడు పెట్టుబడి దారుడని ఆరోపించారు. పాదయాత్ర వెనక్కి మళ్లీంచాలని.. లేకుంటే జరిగే ప్రతి దుష్పరిణామానికి చంద్రబాబే బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. మా ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతీయడానికి చూస్తే చూస్తు ఊరుకోమన్నారు.

ఉత్తరాంధ్రలో రాజధానిని వ్యతిరేకిస్తున్న అచ్చెనాయుడుకి రాజకీయ పతనం తప్పదని మండిపడ్డారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అచ్చెన్నాయుడును ఘోరంగా ఓడించి తీరుతామ‌న్నారు. రాజ‌ధాని రైతులు ఉత్త‌రాంధ్ర‌లోకి అడుగు పెడితే.. కాళ్లు విర‌గ్గోట్టేందుకు ఇక్క‌డి ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని.. ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.