కేసీయార్ ది ఒంటరి పోరాటమేనా ?

KCR

జాతీయ పార్టీ పెట్టి నేషనల్ పాలిటిక్స్ లోకి ప్రవేశించాలని అనుకుంటున్న కేసీయార్ ఒంటరి పోరాటం చేయాలని అనుకుంటున్నారా ? అవుననే చెబుతున్నాయి పార్టీ వర్గాలు. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో, సీనియర్ నేతలతో కేసీయార్ ఈరోజు అంటే ఆదివారం కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 5వ తేదీన విజయదశమి రోజున జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఫిక్సయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈలోపు అందుకు అవసరమైన సన్నాహాలన్నింటినీ కేసీయార్ చేస్తున్నారు.

సరే జాతీయ పార్టీ పెట్టిన తర్వాత 2024 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు సమాచారం. కారణం ఏమిటంటే కొత్తపార్టీతో పొత్తులు పెట్టుకోవటానికి మిగిలిన పార్టీలు పెద్దగా ఆసక్తిచూపవు. అందుకనే పూర్వ నిజాం స్టేట్ అయిన తెలంగాణా, మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టారట. కర్నాటకలో బహుశా మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ నాయకత్వంలోని జేడీఎస్, కొన్ని రైతు సంఘాలు మద్దతు చెప్పాయంటున్నారు.

అలాగే మహారాష్ట్రలో రాజకీయ పార్టీలేవీ మద్దతు చెప్పకపోయినా కొన్ని రైతు సంఘాలతో ఇప్పటికే కేసీయార్ భేటీ అన్నీ విషయాలను చర్చించారట. కాబట్టి రైతుసంఘాల నేతలు ఎవరైనా కేసీయార్ తో చేయికలిపే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. ఈమధ్యనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలాతో కూడా భేటీ అయ్యారు. నిజానికి 80 ఏళ్ళకు పైబడిన వాఘేలా అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అయిపోయారు. కేసీయార్ తో భేటీఅయిన రైతుసంఘాల నేతలకు జనాల్లో ఏ మేరకు పట్టుందో ఎవరికీ తెలీదు.

ఇక కర్నాటకలో దేవేగౌడ లేస్తే కూర్చోలేరు. ఆయన కొడుకు, మాజీ సీఎం కుమారస్వామికి రాష్ట్రంపై పెద్దగా పట్టులేదు. సరే కేసీయార్ ఈరోజు పార్టీ పెట్టేయగానే పోలోమంటు జనాలొచ్చి ఓటలేసేస్తారని ఎవరు అనుకోవటంలేదు. మొదట్లో బీజేపీ కూడా దశాబ్దాల పాటు ఓట్లు, సీట్లు లేక నానా అవస్తలు పడిన పార్టీయే. కేసీయార్ జాతీయపార్టీ భవిష్యత్తు 2023 షెడ్యూల్ ఎన్నికలపైనే ఆధారపడుంది. వచ్చే ఎన్నికల్లో మూడోసారి అధికారంలోకి వస్తే జాతీయపార్టీ భవిష్యత్తుకు పర్వాలేదు. లేకపోతే మాత్రం పురిటిలోనే దెబ్బపడిపోతుంది.