నియోజ‌క‌వ‌ర్గానికి వెయ్యిమందితో టీడీపీ యాక్ష‌న్ ప్లాన్‌…!


టీడీపీ ఇప్పుడు ఈ ప‌నిమీదే బిజీ బిజీగా ఉంది. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గానికి.. వెయ్యి మంది కార్య‌క‌ర్త‌ల‌ను రెడీ చేస్తోంద‌ట‌. ఇప్ప‌టికే.. చాలా మంది నాయ‌కులు ఉన్నారు. అయితే.. వీరిలో కొంద‌రు వ‌యోభారంతోనూ.. మ‌రికొంద‌రు.. ఇత‌ర కార‌ణాల‌తోనూ.. ప‌క్క‌న ఉన్నా.. కార్య‌క‌ర్త‌ల‌ను మాత్రం నిరంతరం ఎంగేజ్ చేసేలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి..అంత‌ర్గ‌తంగా.. కార్య‌క‌ర్త‌ల‌ను తీసుకుంటున్నార‌ని అంటున్నారు.

పార్టీలో సుదీర్ఘ‌కాలంగా ఉన్న యువ‌త‌ను.. ముఖ్యంగా ఇప్పుడు ఉండ‌వ‌ల్లిలోని టీడీపీ కార్యాల‌యానికి పిలుస్తున్నారు. ద‌స‌రా వెళ్లిన మ‌ర్నాడు నుంచి వీరితో స్వ‌యంగా చంద్ర‌బాబు భేటీ అవుతార‌ని చెబుతున్నారు. మ‌రి వీరి ల‌క్ష్యం ఏంటి? ఎందుకు? అంటే.. మొత్తం.. రాష్ట్రంలో 450 రోజుల పాటు.. నారా లోకేష్‌.. పాద‌యాత్ర చేయ‌నున్నారు. ఇది క‌న్ఫ‌ర్మ్‌. అయితే.. ఎక్క‌డ నుంచి ప్రారంభించాలి.. ఎలా ప్రారంభించాల‌నే విష‌యాల‌పై పొలిట్ బ్యూరో.. చ‌ర్చిస్తోంది.

ఈ క్ర‌మంలోనే నారా లోకేష్ పాద‌యాత్ర అంటే.. ఏదో ఆషామాషీగా జ‌రిగేది కాకుండా.. భారీ ఎత్తున చ‌ర్చ‌కు వ‌చ్చేలా.. నింగి వంగిందా.. నేల ఈనిందా! అన్న‌.. అన్న‌గారి డైలాగును ప్ర‌జ‌లు మ‌రోసారి గుర్తుకు తెచ్చేలా.. జ‌నసందోహాన్ని చేర్చాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. ఇది అన్ని వేళ‌లా సాధ్యం కాదు. అందుకే.. నియోజ‌క‌వ‌ర్గానికి వెయ్యి మంది చొప్పున కార్య‌క‌ర్త‌ల‌ను ఈ పాద‌యాత్ర‌లో నిర్విరామంగా వాడుకునేలా.. ప్లాన్ చేశారు.

వారికి భోజ‌నం.. వ‌స‌తి ఆ నియోజ‌వ‌క‌ర్గాల్లోని కీల‌క నాయ‌కులు ఏర్పాటు చేస్తారు. నియోజ‌వ‌క‌ర్గంలోనూ.. మండ‌లాల వారీగా .. వీరిని ఎంపిక చేస్తున్నారు. పార్టీపై అభిమానం.. ఉన్న వారికే ప్ర‌ధమ ఛాన్స్ ఇస్తున్నార‌ని అంటున్నారు. వీరు నారా లోకేష్ పాద‌యాత్ర‌లో ఆయ‌న‌తోపాటు పాదం క‌లపాలి. పార్టీ తర‌ఫున స్లోగ‌న్లు ఇవ్వాలి. యూట్యూబ్‌లోనూ.. ప్ర‌చారం చేస్తే.. మంచిది. ఇక‌, ఒక్కొక్క కార్య‌క‌ర్త ప‌దిమందినైనా.. పాద‌యాత్ర‌లో క‌నీసం రెండు కిలో మీట‌ర్ల న‌డిచే.. త‌మ స్నేహితుల‌ను బంధువులను తీసుకువ‌స్తే.. వారికి ప్రాధాన్యం ఉంటుంద‌ని అంటున్నారు. మొత్తంగా.. పాద‌యాత్ర‌ను చాలా అద్భుతంగానే ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.