అదేంటి.. జ‌గ‌న్ ‘సంక్షేమం’ ఇన్ని చేతులు మారుతోంది?

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అనేక సంక్షేమ కార్య‌క్ర‌మాలు.. నేరుగా ప్ర‌జ‌ల‌కే చేరుతున్నాయి. అంటే.. సీఎం జ‌గ‌న్‌..ఏం చేయాల‌ని అనుకున్నా.. వెంట‌నే.. ఆయ‌న స్వ‌యంగా బ‌ట‌న్ నొక్కుతాడు.. నేరుగా.. ల‌బ్ధిదారుల ఖాతాల్లోకే చేరుతోంది. ఇదే విష‌యాన్ని సీఎం జ‌గ‌న్ ప‌దే ప‌దే చెప్పారు కూడా. “రాష్ట్రంలో ఎక్క‌డా అవినీతి లేదు.. అక్ర‌మం లేదు.. బ‌ట‌న్ నొక్క‌గానే.. అక్క‌చెల్లెమ్మ‌ల ఖాతాల్లోకిడ‌బ్బులు నేరుగా పోతున్నాయి” అని పేర్కొంటున్నారు.

ఇలా.. గ‌త‌ మూడేళ్లు జ‌రుగుతూనే ఉంది.(క‌రోనా కాలం ప‌క్క‌న పెడితే).. ఏ ప‌థ‌కానికైనా.. సీఎం జ‌గ‌న్ బ‌టన్ నొక్క‌డం.. ల‌బ్ధిదారుల ఖాతాల్లోకి నిదులు చేర‌డం.. ఇదీ సంగ‌తి! దీంతో క్షేత్ర‌స్థాయిలో ఉన్న నాయకులు.. ఎమ్మెల్యేలు.. మంత్రుల‌కు ‘చేతినిండా’ పనిలేకుండా పోయింద‌నే విమ‌ర్శ‌లు వున్నాయి. నిజానికి వ‌లంటీర్ వ్య‌వ‌స్ధ‌.. డీబీటీ(డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స‌ఫ‌ర్‌) వ‌చ్చిన తర్వాత‌.. ల‌బ్ధిదారుల‌ను వ‌లంటీర్ ఎంపిక చేస్తుండ‌గా.. నిధులను సీఎం జ‌గ‌న్ నేరుగా ఇస్తున్నారు.

దీంతో ప్ర‌జాప్ర‌తినిధుల అవ‌సరం.. ప్ర‌జ‌ల‌తో ఎమ్మెల్యేలు.. మంత్రుల‌కు ఉన్న సంబంధాలు దాదాపు తెగిపోయాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంది. ఇది వాస్త‌వం కూడా. దీనిపై కొన్నాళ్ల‌పాటు ఎమ్మెల్యేలు.. మంత్రులు సైతం అలిగారు. మీరే ప్ర‌జ‌ల‌తో నేరుగా సంబంధాలు పెట్టుకుని.. వ‌లంటీర్ వ్య‌వ‌స్థ ద్వారా మేనేజ్ చేస్తే.. మేం ఎందుకు? మేం ఏంచేయాల‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌య్యాయి. కొంద‌రు నాయ‌కులు ఈ విష‌యాన్ని చాలా సీరియ‌స్‌గా కూడా తీసుకున్నారు.

ఈ క్ర‌మంలో మ‌రి.. ఈ విష‌యంపై.. జ‌గ‌న్ ఏమ‌నుకున్నాడో ఏమో.. తాజాగా వైఎస్సార్ చేయూత నిధుల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేల‌ను భాగ‌స్వాముల‌ను చేశారు. వాస్త‌వానికి ఈ కార్య‌క్ర‌మాన్ని ఇటీవ‌ల కుప్పంలో.. సీఎం జ‌గ‌న్ ప్రారంభించిన‌ప్ప‌టికీ.. ల‌బ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు వేసే కార్య‌క్ర‌మాన్ని ఎక్కడిక‌క్క‌డ నిర్వ‌హించాల‌ని ఆదేశించారు.

దీంతో ఎమ్మెల్యేలు.. తమ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో.. కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేసుకుని.. ప్ర‌జ‌ల‌కు చెక్కులు అందిస్తున్నారు. ఇది.. అటు ప్ర‌భుత్వానికి, ఇటు.. త‌మ‌కు కూడా మేలు చేస్తోంద‌ని వారుచెబుతున్నారు. మొత్తానికి సీఎం జ‌గ‌న్ ఇన్నాళ్ల‌కు త‌మ పార్టీ నేత‌ల మొర విన్నార‌ని అంటున్నారు.