వైసీపీని పీఎఫ్ఐతో పోల్చిన బీజేపీ

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని.. వ‌చ్చేస్తామ‌ని.. చెబుతున్న బీజేపీ కి మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతోంది. వాస్త‌వానికి కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌తో ఉన్న సంబంధాలు కావొ చ్చు.. లేదా.. స్థానికంగా బీజేపీకి ఏమీ లేదు.. అనుకుని అయినా.. ఉండొచ్చు.. దీంతో వైసీపీ నాయ‌కులు పెద్ద‌గా బీజేపీ విష‌యంలో స్పందించ‌డం లేదు. అయినా..కూడా.. అప్పుడ‌ప్పుడు.. బీజేపీ నేత‌ల‌కు.. వైసీపీ నాయ‌కులకు మ‌ధ్య మాట‌ల యుద్ధం అయితే.. జ‌రుగుతోంది.

తాజాగా.. బీజేపీ జాతీయ నాయ‌కుడు.. అనంత‌పురం జిల్లాకు చెందిన స‌త్య‌కుమార్‌.. వైసీపీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల ఉగ్ర సంస్థ‌ల‌కు సాయం చేస్తోంద‌ని.. ఆ సంస్థ‌కు.. కార్య‌క‌ర్త‌ల‌ను అందిస్తోందని పేర్కొంటూ.. పీఎఫ్ఐ(పాపుల‌ర్ ఫ్రెంట్ ఆఫ్ ఇండియా)పై కేంద్రం నిషేధం విధించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఆ సంస్థ‌తో వైసీపీని పోల్చుతూ.. స‌త్య కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు.

వైసీపీని నిషేధిత పీఎఫ్‌ఐతో పోలుస్తూ.. సత్యకుమార్ కామెంట్లు చేశారు. అదేస‌మ‌యంలో వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిషేధిత పీఎఫ్‌ఐ, వైసీపీ రెండూ ఒక్కటేన‌న్నారు. రెండింటివీ విధ్వంసకర ఆలోచనలేన‌ని చెప్పారు. ఈ త‌ర‌హాలోనే వైసీపీ.. ఏపీని నాశ‌నం చేస్తోంద‌న్నారు. పీఎం గరీబ్‌కల్యాణ్ బియ్యాన్ని వైసీపీ నేత‌లు కొంద‌రు దారి మళ్లించి జేబులు నింపుకొంటున్నార‌ని నిప్పులు చెరిగారు.

గడప గడపకు వెళ్తున్న వైసీపీ నేత‌ల‌కు ఛీత్కారాలు ఎదురవుతున్నాయని, ప్ర‌జ‌లు దుమ్మెత్తి పోస్తున్నార‌ని అన్నారు. ప్రజా వ్యతిరేకతపై సీఎం జగన్‌ ఆత్మపరిశీలన చేసుకోవాల‌న్నారు. పులివెందులలో జగన్ కు సగం మద్దతే ఉందని పీకే టీం సర్వేలో తేలిందన్నారు. గృహ నిర్మాణంపై సీఎం ఎన్నిసార్లు సమీక్షించినా పురోగతి లేదని విమ‌ర్శించారు. రాష్ట్రంలో 10 శాతం కంటే ఎక్కువ ఇళ్లు నిర్మించలేదన్న ఆయ‌న విశాఖలో సీఎం ఇల్లు కడితే విశాఖ అభివృద్ధి అవుతుందా అని నిల‌దీశారు. మ‌రి దీనిపై వైసీపీ నేత‌లు ఎలాంటి కౌంట‌ర్ ఇస్తారో చూడాలి.