హరీష్ రావుకు బొత్స కౌంటర్

ఆంధ్రప్రదేశ్లో సీపీఎస్ రద్దు వ్యవహారంపై ఉద్యోగులతోపాటు ఉపాధ్యాయులు కూడా తీవ్ర నిరసనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఉపాధ్యాయులపై కూడా బైండోవర్ కేసులు, బెదిరింపులు వంటి చర్యలతో భయపెట్టి ఆ నిరసనలు, ఆందోళనలను జగన్ సర్కార్ అణచివేయడం చర్చనీయాంశమైంది. చర్చల పేరుతో కాలయాపన చేసిన ఏపీ ప్రభుత్వం తీరును టీడీపీ నేతలతో పాటు ఏపీలోని విపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండించాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ఉపాధ్యాయుల పట్ల జగన్ సర్కార్ తీరుని తెలంగాణ మంత్రి హరీష్ రావు కూడా ఖండించారు. సిద్దిపేటలోని ఉపాధ్యాయ సంఘం సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు చేసిన కామెంట్లు ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. తెలంగాణలో ఉపాధ్యాయులతో ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటోందని, కానీ, ఏపీలో మాత్రం ఉపాధ్యాయులపై కేసులు పెట్టి జైల్లో వేస్తోందని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఐదేళ్ల కాలంలో ఉద్యోగులకు 73% ఫిట్మెంట్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని హరీష్ రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితితో పోలిస్తే తెలంగాణలో తమ ప్రభుత్వం ఉద్యోగులను ఎంత బాగా చూసుకుంటుందో అర్థమవుతుందని అన్నారు. మరోవైపు, హరీష్ రావు వ్యాఖ్యలను ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా హరీష్ రావు మాట్లాడడం సరికాదని బొత్స అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారని బొత్స అన్నారు. హరీష్ రావు ఒకసారి ఏపీకి వచ్చి ఇక్కడ టీచర్లతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలని బొత్స హితవు పలికారు. ఏపీ, తెలంగాణ పీఆర్సీలు పక్కపక్కనే పెట్టుకుని చూస్తే ఆ తేడా ఏంటో తెలుస్తుంది అని బొత్స అన్నారు. ఏది ఏమైనా…బొత్స వర్సెస్ హరీష్ మాటల యుద్ధం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.