సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరో 19 మాసాలే గడువు ఉందని.. నాయకులు రెడీ కావాలని..ఎన్నికల్లో గెలుపు గుర్రాలు ఎక్కాల్సిందేనని.. నాయకులకు తేల్చిచెప్పారు. అయితే.. ఈ గడువు.. ఒక్క ఎమ్మెల్యేలకు, మంత్రులకు మాత్రమే కాదని అంటున్నారు పరిశీలకులు. సీఎం జగన్‌కు కూడా 19 మాసాలే గడువు ఉందని చెబుతున్నారు. గత ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీల్లో నెరవేరని.. నెరవేర్చని శుభసంకల్పాలు అనేకం ఉన్నాయని చెబుతన్నారు.
వాటిని నెరవేర్చాల్సిన అవసరం.. కూడా ఉందని.. లేకపోతే.. ప్రజలు రేపు నిలదీస్తారని అంటున్నారు. ఈ సమస్యలను.. లేదాహామీలను నెరవేర్చేందుకు సీఎం జగన్‌కు ఉన్న గడువు కూడా కేవలం 19 మాసాలేనని చెబుతున్నారు. వీటిలో ప్రధానంగా.. పోలవరం పూర్తి వెంటాడుతోంది. తాను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దీనిని పూర్తిచేస్తామన్నారు. ఇది సాధ్యం కావడం లేదు. విశాఖకు రైల్వే జోన్ ఎందుకు ఇవ్వరు.. చంద్రబాబు అడగడం లేదు.. అన్నారు. ఇప్పుడు అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది.. తప్ప అంగుళం కూడా ముందుకు జరగలేదు.
మరోవైపు.. చంద్రబాబు శంకుస్థాపన చేసిన.. కడప ఉక్కుపరిశ్రమను కాదని.. తాను స్వయంగా శంకుస్తాపన చేశారు. అయితే.. అది కూడా.. అక్కడి నుంచి ఒక్క అడుగు ముందుకు పడడం లేదు. వెనుకబడిన జిల్లాలకు.. ఇచ్చిన హామీలు కూడా అలానే ఉన్నాయి. ఉద్ధానంలో కిడ్నీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తానని.. ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేర్చ లేదు. ఇవన్నీ ఇలా.. ఉంటే.. మరోవైపు.. ప్రత్యేక హోదా సాధన ఇంకా ‘ప్లీజ్’ గేట్ దాటలేదు. మరి వీటిని సాధించకుండా.. జగన్ ఎన్నికలకు వెళ్లడం సాధ్యమేనా.. వెళ్లినా.. ప్రజలకు ఏం చెబుతారు? అనేది ప్రశ్న.
నిజానికి… వైసీపీ నాయకులు తప్పించుకునేందుకు చాలానే అవకాశాలు దారులు ఉన్నాయి. మా సీఎం మాకు డబ్బులు ఇవ్వలేదు..కాబట్టి.. మేం పనులు చేయలేక పోయాం.. అని వారు చెప్పి తప్పించుకునే అవకాశం ఉంది. కానీ, జగన్ అలా చెప్పేందుకు చాన్స్ లేదని పరిశీలకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కే ఈ 19 నెలలు అత్యంత కీలకమని. రాష్ట్ర ప్రజలను మెప్పించేందుకు ఆయనకే చాలా తక్కువ సమయం ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates