గంజాయి సరఫరాలో ఏపీనే నెం.1

గత రెండేళ్లుగా ఏపీలో గంజాయి భారీగా పట్టుబడుతుండడం సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అరకు, విశాఖ, మన్యంలోని కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో యథేచ్ఛగా వందల ఎకరాల్లో గంజాయి సాగు సాగిస్తున్నారని, అయినా సరే ప్రభుత్వం, ఎస్ఈబీ అధికారులు, పోలీసులు ఉదాసీనంగా ఉంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దేశంలోనే గంజాయి సరఫరాలో తొలి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఉడ్తా పంజాబ్ తరహాలో ఉడ్తా ఏపీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

2021లో పట్టుబడ్డ హెరాయిన్, గంజాయిల నిల్వలలకు సంబంధించి నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో తాజాగా నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో దేశంలోనే గంజాయి సరఫరా చేసే రాష్ట్రాల్లో ఏపీ అగ్ర స్థానంలో నిలిచింది. మన దేశంలో 7 లక్షల కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకోగా..అందులో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ వాటా 26 శాతం ఉండడం సగటు ఆంధ్రప్రదేశ్ వాసిని కలవపాటుకు గురిచేస్తోంది.

ఏపీలో దాదాపు 2 లక్షల కిలోలకు పైగా గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నివేదికలో విశాఖకు ఆనుకొని ఉన్న ఒడిస్సా రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ఇక, హెరాయిన్ విషయానికి వస్తే ప్రధాని మోడీ ఇలాకా గుజరాత్‌ తొలి స్థానంలో నిలిచింది. మొత్తం 3334 కిలోల హెరాయిన్‌ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ కేసుల్లో సీఎం యోగీ పాలనలో ఉన్న యూపీ రెండో స్థానంలో ఉంది. ఇక, మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో 35,270 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఉడ్తా పంజాబ్ సినిమా టైటిల్ కు న్యాయం చేస్తూ అత్యధిక మత్తుపదార్థాల ప్రభావం పంజాబ్‌లోనే ఉందని ఎన్సీబీ అధికారులు చెబుతున్నారు. ఏతావాతా దేశంలో సరఫరా అవుతోన్న గంజాయిలో 50 శాతానికి పైగా ఆంధ్ర, ఒడిస్సా రాష్ట్రాల నుంచే సాగవడం షాకింగ్ గా మారింది. ఏపీలో గంజాయిని తరలిస్తున్న 4202 మందిని గత ఏడాది పోలీసులు అరెస్ట్ చేసి..1775 కేసులు నమోదు చేశారు. గత ఏడాది ఏపీలో 18 కిలోల హాశిష్ ఆయిల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, పట్టుబడ్డ గంజాయి నిల్వల వల్లే ఏపీ మొదటి స్థానంలో ఉందంటే…ఇక పట్టుబడకుండా…పోలీసుల కంటబడకుండా సాగవుతున్న, సరఫరా అవుతున్న గంజాయి సంగతేంటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.