ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ఫైట్ మాత్రం చాలా టఫ్‌గా ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే.. అభివృద్ది నినాదం ఒకవైపు.. సంక్షేమ నినాదం మరో వైపు.. రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలో సంక్షేమం కోరుకునేవారు.. అభివృద్ధిని కోరుకునే వారుగా ఏపీ సమాజం ఈ రోజు చీలిపోతున్న సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు.. సంక్షేమం+అభివృద్ధిని కోరుకునేవారు కూడా సమాజంలో కనిపిస్తున్నారు.
అంటే మొత్తంగా.. ఏపీలో సమాజం మూడు వర్గాలుగా చీలిపోయిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి ఒకప్పుడు ఇంత స్పష్టమైన విభజన రేఖ ప్రజల్లో మనకు కనిపించలేదు. కానీ, ఇప్పుడు ప్రజలు మారారు.. సోషల్ మీడియా కూడా చాలా వరకు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రజల ఆలోచనా విధానం కూడా మారిపోయింది. ఈ క్రమంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వారు నిశితంగా గమనిస్తున్నారు.
కొందరు సంక్షేమం కావాలని.. అంటున్నారు. ఇప్పటికే… వైసీపీ ప్రభుత్వం దీనిని అమలు చేస్తోంది. కోట్లకు కోట్ల రూపాయలు అప్పులు చేసి మరీ.. సంక్షేమానికి వినియోగిస్తున్నామని కూడా చెబుతోంది. అయితే. దీనిని మెజారిటీ ప్రజలు తప్పుబడుతున్నారు. మేం కడుతున్న పన్నులతోనే ఇలా అమలు చేస్తున్నారు. మరి మాకేంటి? అని అడుగుతున్నారు. కనీసం రోడ్డు కూడా వేయడానికి నిధులు లేకుండా పోతున్నాయా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇక, మధ్యతరగతి వర్గం.. సంక్షేమం+ అభివృద్ధి రెండూ కావాలని కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పలు యూట్యూబ్ చానెళ్ల నిర్వాహకులు చేస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల నుంచి ఇదే తరహా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొందరు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. మరికొందరు అభివృద్ధి అంటున్నారు. ఇంకొందరు రెండూ కావాలని కోరుతున్నారు. దీంతో రాష్ట్రంలో వచ్చే ఎన్నికలు అత్యంత టఫ్ కావడం గమనార్హం అంటున్నారు పరిశీలకులు.