ప్రముఖ సినీనటుడు ఆలీ వైసీపీలో ఇమడలేకపోతున్నట్లున్నారు. పార్టీలో చేరగానే తనకేదో బ్రహ్మాండమైన గుర్తింపు వచ్చేస్తుందని, పెద్ద పదవేదో ఇచ్చేస్తారని ఆశించి ఆలీ వైసీపీలో చేరారు. అయితే రోజులు గడుస్తున్నాయే కానీ పదవి కానీ ఆశించిన గుర్తింపు కానీ రావటం లేదు. దాంతో ముందు ముందు వస్తుందనే నమ్మకం కూడా తగ్గిపోతున్నట్లుంది. దాంతో ఏమి చేయాలో అర్ధంకాక పార్టీ మారితే ఎలాగుంటుందని ఆలోచిస్తున్నారట.
తనకు బాగా సన్నిహితుడైన పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరమని కొందరు సన్నిహితులు ఇచ్చిన సలహాను పరిశీలిస్తున్నారట. అయితే జనసేనలో కూడా ఏపాటి ఆధరణ ఉంటుందనే విషయంలోనే కాస్త వెనకాడుతున్నట్లు సమాచారం. గతంలో ఆలీ టీడీపీలో కూడా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే అందులో సరైన గుర్తింపు దక్కలేదన్న అసంతృప్తితోనే పార్టీ మారారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఎదురవుతుండటంతో దిక్కుతోచటం లేదు.
ఇక్కడ విషయం ఏమిటంటే పార్టీలోకి రమ్మని ఆలీని ఎవరు పిలవలేదు. తనంతట తానుగానే ఏదో ఆశించి వైసీపీలో చేరారు. ఏదో ఆశించే చేరారు కాబట్టి ఆశించింది దక్కకపోవటంతో అసంతృప్తి మొదలైంది. ఇందులో మీడియా పాత్రకూడా చాలానే ఉంది. ఒకసారి జగన్ ను కలవగానే ఇంకేముంది ఆలీకి రాజ్యసభ ఖాయమని ఒకసారి, ఆలీకి ఎంఎల్సీ విషయంలో జగన్ హామీ ఇచ్చారని మరోసారి ఒకటే ఊదరగొట్టేసింది. మీడియాలో వచ్చినవేవీ దక్కకపోవటంతో అసంతృప్తి పెరుగుతోంది.
ఆలీ తెలుసుకోవాల్సిందేమంటే ఆలీకన్నా ముందునుండే పోసాని కృష్ణమురళి, విజయచందర్, పృధ్వి, మోహన్ బాబు లాంటి వాళ్ళు పనిచేశారు. పృధ్వికి ఎస్వీబీసీ ఛైర్మన్ ఇచ్చినా నిలుపుకోలేకపోయారు. మోహన్ బాబుకు పదవేమీ దక్కలేదు. విజయచందర్ కు ఎఫ్డీసీ ఛైర్మన్ దక్కటం పదవీ కాలం ముగియటం కూడా అయిపోయింది. తాను ఏ పదవీ ఆశించి పార్టీలో చేరలేదని చెప్పారు కాబట్టి పోసానితో సమస్య లేదు. ఎటొచ్చీ ఏదో ఆశించి పార్టీలో చేరారు కాబట్టే ఆలీలో అసంతృప్తి పెరిగిపోతోంది. మరి జనసేనలో అయినా తాను ఆశించింది దక్కుతుందేమో చూడాలి. పైగా గతంలో పవన్ ను తక్కువ చేసి మాట్లాడాడు.. మరి పార్టీలో ఎంట్రీ దక్కుతుందా?
Gulte Telugu Telugu Political and Movie News Updates