ఫైర్‌బ్రాండ్ నానీకి .. జ‌గ‌న్ బిగ్ షాక్‌

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. మాజీ మంత్రి.. ఫైర్ బ్రాండ్ పేర్ని నానికి సీఎం జ‌గ‌న్ భారీ బిగ్ షాక్ ఇచ్చారు. ఆయ‌న ఎప్ప‌టి నుంచో కోరుతున్న కీల‌క‌మైన ఆకాంక్ష‌ను జ‌గ‌న్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. “అది కుద‌ర‌దు” అని తేల్చి చెప్పేశారు. తాజాగా పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మంత్రుల‌తో స‌మావేశ‌మైన‌.. సీఎం జ‌గ‌న్‌.. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్షించారు. ఈ క్ర‌మంలో ఎవ‌రు ప్ర‌జ‌ల్లో ఉంటున్నారు. ఎవ‌రు ఉండ‌డం లేదో అనే విష‌యాల‌పై ఆయ‌న పూస గుచ్చిన‌ట్టు వివ‌రించారు.

ఈ నేప‌థ్యంలో ఒక్కొక్క‌రితోనూ స‌మ‌స్య‌ల‌పైనా సీఎం జ‌గ‌న్ చ‌ర్చించారు. ఈ క్ర‌మంలో పేర్ని నాని లేచి మాట్లాడుతూ “మా నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ భారీ మెజారిటీ సొంతం చేసుకుంటుంది. ఈ విష‌యంలో ఢోకాలేదు. మా అబ్బాయితో పాటు నేను కూడా ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటున్నాం.” అని వివ‌రించారు. ప‌నిలో ప‌నిగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ నుంచి త‌ప్పుకోవాల‌ని అనుకుంటున్నాన‌ని బ‌హిరంగంగానే పేర్ని నాని వెల్ల‌డించారు. దీంతో స‌మావేశంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు అంద‌రూ షాక్ అయ్యారు.

త‌న స్తానంలో త‌న కుమారుడు పేర్ని కృష్ణ‌మూర్తికి టికెట్ ఇవ్వాల‌ని.. నాని అభ్య‌ర్థించారు. అయితే.. దీనిపై వెంట‌నే జోక్యం చేసుకోకుండా త‌ర్వాత‌ మాట్లాడ‌దాం అని జ‌గ‌న్ అన్నారు. ఆ త‌ర్వాత‌ పేర్ని నానిని పిలిపించుకున్న జ‌గ‌న్‌ “వ‌చ్చే ఎన్నిక‌లు చాలా చాలా ట‌ఫ్. ఆ విష‌యం నీకు తెలిసిందే. మీ అబ్బాయికి ఇప్పుడే కాదు చాలా ఫ్యూచ‌ర్ ఉంది. నాకు వ‌దిలేయ్‌. నువ్వు పోటీ చేస్తున్నావ్‌. నాతో క‌లిసి ముందుకు సాగుతున్నావ్‌. ఈ విష‌యంలో రెండో మాటే లేదు” అని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశార‌ట‌.

ఇదీ సంగ‌తి దీనిని బ‌ట్టి జ‌గ‌న్ వార‌సుల‌ను ప‌క్క‌న పెడుతున్నార‌నే సంకేతాలు ఇచ్చేసిన‌ట్టేన‌ని అంటున్నారు సీనియ‌ర్లు.