వైసీపీ ప్రజాప్రతినిధులకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్.. తనదైన శైలిలోకౌన్సెలింగ్ ఇచ్చారు. మారతా రా? మార్చమంటారా?
అంటూ.. ఆయన ప్రశ్నించారు. తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో.. ఆయన వైసీపీ ఎమ్మెల్యేలు.. మంత్రులు.. ఎంపీలతో సమావేశం అయ్యారు. గతంలోనూ ఇలానే ఒక సమావేశం నిర్వహించి.. పనితీరుమెరుగు పరుచుకోవాలంటూ.. వారికి క్లాస్ ఇచ్చారు. అప్పట్లో 67 మంది పరిస్థితి బాగోలేదని.. ఆయనే స్వయంగా చెప్పారు.
ఇక, ఇప్పుడు తాజాగా జరిగిన సమావేశంలో.. ఈ సంఖ్య 27 కు తగ్గినట్టు సీఎం చెప్పారు. అయితే.. ఇదేమంత తేలికగా తీసుకునే విషయం కాదని.. సీరియస్‌గానే తాను చెబుతున్నానని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ చురకలంటించారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు సర్వే నివేదికను సీఎం జగన్ వెల్లడించారు. గడపగడపకు కార్యక్రమంలో 27 మంది చురుకుగా లేరంటూ మండిపడ్డారు.
27 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని సీఎం జగన్ గట్టిగానే చెప్పినట్టు తాడేపల్లి వర్గాలు తెలిపాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 27 మంది 16 రోజులు మాత్రమే తిరిగారని, వారి పేర్లు వెల్లడించే పరిస్థితి తీసుకురావద్దని జగన్ సూచించారు. పనితీరు మెరుగుపరచు కోవాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటానని హెచ్చరించినట్లు సమాచారం.
తీరు మార్చుకోకపోతే సీటు ఇచ్చేది లేదని జగన్ తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. నవంబర్‌లో మరోసారి ఎమ్మెల్యేల పనితీరు సమీక్షిస్తానని తెలిపారు. ఎన్నికలకు 6 నెలల ముందే సీటు ఇవ్వనివారి పేర్లు ప్రకటిస్తానని జగన్ వెల్లడించారు. అయితే.. ప్రస్తుతం.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం కొందరికే అందుతోందని.. అందుకే తమపై వ్యతిరేకత చూపిస్తున్నారని.. కొందరు ఎమ్మెల్యేలు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే.. అవన్నీ తనకు తెలుసునని.. మీరు ప్రజల్లో ఉండాలని గట్టిగా చెప్పినట్టు తెలిసింది.