ఏదేమైనా.. ఎవరు ఎన్ని అన్నన్నా.. నిజాలు గడపదాటే లోపే.. అబద్ధం ఊరు చుట్టివస్తుందనేది సామెత. ఇది వాస్తవం కూడా. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఇలాంటివి కామన్‌గా కూడా మారిపోయాయి. ఇప్పుడు మూడు రాజధానుల విషయంపైనా.. అదే జరుగుతుందని మేధావులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ మూడు రాజధానుల కోసం పట్టుబట్టింది. ఎక్కడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.. చెబుతోంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు అనుకూలంగా ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉందనే సంకేతాలు వస్తున్నాయి.
ఈ క్రమంలో అనేక అబద్ధాలను పోగేసి.. చెప్పినా.. చెప్పే సాహసం చేయొచ్చు. నిజానికి ప్రతిసారీ అసెంబ్లీ లో మూడు రాజధానులపై చర్చ వచ్చినప్పుడు.. అమరావతిలో రైతులను మోసం చేసి.. టీడీపీ నేతలు కొన్నారని.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని.. అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే.. ఇది నిజమే అనుకుంటే.. దీనిని కోర్టుల్లో ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు.. ఇది నిలబడలేదు కదా. అంటే.. ఈ అబద్ధాలు న్యాయ వ్యవస్థ ముందు పల్టీ కొట్టాయికదా!
అయినా.. ప్రజలను నమ్మించేందుకు ఈ సీన్‌ను మరింతగా ముందుకు తీసుకువెళ్తోంది వైసీపీ. అందుకే.. చెప్పిందేచెప్పి.. పాడిందే పాడి..పిల్లి పిల్లను. పులి పిల్లగా మార్చే ప్రయత్నం చేస్తోదనే వాదన వినిపిస్తోంది. మరి.. ఈ వ్యూహం.. ప్రజల్లోకి వెళ్లకముందే.. వారు అవాస్తవాలను నమ్మకముందే.. టీడీపీ నాయకులు ప్రజల్లోకి వెళ్లాలని.. మరింత వ్యూహాత్మకంగా ప్రజలను కలిసి.. అసలు రాజధానిపై ఏం జరిగిందనే వాస్తవాలను వారికి వివరించాలని.. మేధావులు సూచిస్తున్నారు.
అంతేకాదు.. వైసీపీ ప్రభుత్వం అమరావతిని ఎలా తొక్కేసిందో.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఏ ఉద్దే శంతో ఇక్కడ రాజధానిని నిర్మించాలని అనుకుందో.. కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని చెబుతున్నారు. రాజధానితో ఏవర్గానికి ఎలాంటి మేలు సమకూరుతుందో వివరించాలని సూచిస్తున్నారు. మరి టీడీపీ నాయకులు ఆదిశగా అడుగులు వేస్తారో..లేదో .. చూడాలి.