జ‌గ‌న్ ఫ్యాక్ష‌న్ బుద్ధి మానుకోలేదు : జ‌గ్గారెడ్డి

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై తెలంగాణలోని సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు జగ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్ అదికారంలో లేన‌ప్పుడు ఫ్యాక్ష‌న్ వ్య‌వ‌హారాలు న‌డిపిన‌ట్టు త‌న‌కు చాలా మంది చెప్పార‌ని అన్నారు. అయితే అప్పుడు ఎలా ఉన్నా అధికారంలోకి వ‌చ్చాక మాత్రం ఆయ‌న‌ ఫ్యాక్ష‌న్ బుద్ధి మానుకోవాలి క‌దా! అని హిత‌వు ప‌లికారు. కానీ, ఆయ‌న వ్య‌వ‌హారం చూస్తే అది మానుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేద‌ని విమ‌ర్శించారు.

తాజాగా మీడియాతో మాట్లాడిన జ‌గ్గారెడ్డి.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు సరికాదని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఖండించారు. అధికారంలో ఉన్నప్పుడు చేసే పనులు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని సూచించారు. అదే అధికారంలో లేనప్పుడు ఎలా నడుచుకున్నా ఎవరూ పట్టించుకోరని అన్నారు. ఏపీకి అమరావతినే రాజధానిగా ఉండాలనేది కాంగ్రెస్ నిర్ణయమని పేర్కొన్నారు.

“తెలుగు ప్రజల్లో మంచి పేరున్న వ్యక్తి ఎన్టీఆర్‌. వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు తీసి వివాదానికి దారి తీయడం తప్పు. వివాదాలతో పేరు పెడితే వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది. పైగా.. అంద‌రూ తిట్టుకుంటారు కూడా! వైసీపీలో ఎన్టీఆర్‌ వద్ద పనిచేసిన వాళ్లే ఉన్నారు కదా? జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఫ్యాక్షన్ స్టైల్‌లోనే ఉంటే ఎట్లా ఆయ‌న మారాలి. ఎన్టీఆర్ పేరును తీసేయొద్దు” అని జ‌గ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

ఏపీకి అమరావతినే రాజధానిగా ఉండాలనేది కాంగ్రెస్ నిర్ణయమని జగ్గారెడ్డి తెలిపారు. ఏపీ కాంగ్రెస్ కూడా అదే నిర్ణయంలో ఉందని అన్నారు. మూడు ప్రాంతాల్లో 3 రాజధానుల నిర్ణయం సరికాదని పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్‌ది తప్పుడు నిర్ణయమని వ్యాఖ్యానించారు. అమరావతి పేరు పెట్టడంలో చంద్రబాబు దృక్పథంతో నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మూడుచోట్ల 3 రాజధానులతో అభివృద్ధి జరగడం సాధ్యం కాదని తెలిపారు.