ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఎక్కడ వేదిక ఎక్కినా.. పొగడ్తల వర్షం కురిపించే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. తాజాగా సీరియస్ కామెంట్లు చేశారు. మోడీపై ఒకరకంగా.. సుతిమెత్తని విమర్శలే చేశారని పరిశీలకులు చెబుతున్నారు. ఆయన రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న సమయంలో.. ప్రతిపక్షాలపై విరుచుకుపడిన విషయం తెలిసిందే. విపక్షాలకు క్రమ శిక్షణ లేదని.. వారికి రాజకీయాల పట్ల నిబద్ధత లేదని.. ప్రతిదాన్నీ.. రాజకీయం చేస్తారని.. ఇలా విరుచుకుపడిన విషయం తెలిసిందే. అంతేకాదు.. దాదాపు ఆయన బీజేపీ నేతల కనుసన్నల్లోనే నడుచుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.
అలాంటిది.. ఉపరాష్ట్రపతిగా.. ఉన్న సమయంలో మోడీని ఆకాశానికి ఎత్తిన నోటితో.. తాజాగా అదే మోడీపై వెంకయ్య వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. విపక్షాల తరుఫున గట్టి గళమే వినిపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి ప్రతిపక్షాలు.. శత్రువులు కాదని, కేవలం ప్రత్యర్థులేనని గుర్తుంచుకోవాలని వెంకయ్యనాయుడు అన్నారు. ప్రధాని మోడీ తరచుగా అన్ని పక్షాల రాజకీయ నాయకులను కలవాలని ఆయన సూచించారు. మోడీ ప్రసంగాల్లో ఎంపిక చేసిన కొన్నింటిని ‘సబ్ కా సాత్..సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు.
ఈ సందర్భంగా సుతిమెత్తగా మోడీపై విమర్శలు గుప్పించారు. , రాజకీయ పార్టీలు కూడా విశాల దృక్పథంతో ఉండాలని, అధికారంలో ఉన్నవారికి మీరు శత్రువులు కాదని కేవలం ప్రత్యర్థులేనని చెప్పారు. అన్ని పార్టీలు పరస్పరం గౌరవించుకోవాలని హితవు పలికారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఒకే సమయంలో మోడీ కూడా.. రాజకీయ పార్టీలపై విమర్శలు గుప్పించారు. రాజకీయ పార్టీలు.. అర్బన్ నక్సల్స్‌కు అండగా ఉంటున్నాయని.. దీంతో దేశంలో అభివృద్ధి ముందుకు సాగడం లేదని.. అన్నారు. అంటే..పరోక్షంగా ఆయన విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో వెంకయ్య చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఉప రాష్ట్రపతిగా వెంకయ్య ఇటీవలే.. పదవీ విరమణ చేశారు. అయితే.. ఆయనకు ప్రమోషన్ ఇచ్చి.. రాష్ట్రపతిని చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే.. అది జరగలేదు. పోనీ.. ప్రమోషన్ కాకపోయినా.. ఉపరాష్ట్రపతిగాఅయినా.. ఆయనకు రెన్యువల్ ఉంటుందని భావించారు. అది కూడా సాధ్యం కాలేదు. దీంతో ఒకింత మనస్తాపంతో ఉన్న వెంకయ్య.. ఇలా బ్లాస్ట్ అయ్యారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.