ఇది మరో తలతిక్క నిర్ణయమేనా ?

జగన్మోహన్ రెడ్డి కొన్ని నిర్ణయాలను ఎందుకు తీసుకుంటోందో కూడా ఎవరికీ అర్థం కావటం లేదు. తాజాగా కృష్ణా బోర్డును విశాఖపట్నంకు తరలించాలని డిసైడ్ చేసింది. ప్రస్తుతం కృష్ణాబోర్డు హైదరాబాద్ లో ఉంది. దీన్ని ఏపీలోని విశాఖకు తరలించాలని కోరుతూ ప్రభుత్వం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు లేఖ రాసింది. విశాఖలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో బోర్డు కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన ఏడు వేల చదరపు అడుగుల స్ధలం ఉందని ప్రభుత్వం లేఖలో చెప్పింది.

కార్యాలయం ఏర్పాటుకు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ భవనం అన్ని విధాలుగా అనువుగా ఉంటుందని ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి లేఖలో స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గతంలోనే విశాఖపట్నంలో పర్యటించిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉన్నతాధికారులు కార్యాలయం ఏర్పాటుకు కనీసం 10 వేల చదరపు అడుగుల స్ధలం అవసరమని స్పష్టంగా చెప్పారు.

బోర్డు ఉన్నతాధికారులు ఏమో 10 వేల చదరపు అడుగుల స్ధలం అవసరమని చెబితే రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఏడువేల చదరపు అడుగుల స్ధలముందని చెబుతోంది. అంటే బోర్డు చెప్పినదానికన్నా ప్రభుత్వం చెప్పిన స్ధలం 3 వేల చదరపు అడుగుల స్ధలం తక్కువ. మరి విస్తీర్ణం ఇంత తక్కువుంటే బోర్డు ఉన్నతాధికారులు అంగీకరిస్తారో లేదో తెలీదు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే అసలు బోర్డు కార్యాలయం ఏర్పాటు విశాఖపట్నంలో ఎందుకు చేస్తోందో అర్ధం కావటంలేదు.

నిజానికి బోర్డును కర్నూలు జిల్లాలో ఏర్పాటుచేయటమే కరెక్టు. ఎందుకంటే కృష్ణానది మనరాష్ట్రంలోకి ప్రవేశించేది కర్నూలు జిల్లాలో నుండే. కృష్ణానదీ ముఖద్వారం కర్నూలు జిల్లాలోనే కాబట్టి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఇక్కడే ఏర్పాటు చేయాలనే డిమాండ్లు కూడా జిల్లాలో వినబడుతున్నాయి. అయినా కృష్ణానదీ పరీవాహక ప్రాంతానికి ఎలాంటి సంబంధం లేని విశాఖలో ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం నిర్ణయించింది. బహుశా రాజధానిగా మార్చాలని అనుకుంటున్నది కాబట్టి బోర్డును విశాఖలోనే ఏర్పాటు చేయాలని అనుకుంటున్నదేమో. ఏది ఏమైనా ఇది అనాలోచిత నిర్ణయంగా చూడాలి.