జూనియర్ ను అనిల్ రెచ్చ గొడుతున్నారా ?

హెల్త్ యూనివర్సిటీ కి ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ అని పేరు పెట్టడంపై సెగలు ఇంకా రేగుతునే ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం డైరెక్టుగా జూనియర్ ని టార్గెట్ చేశారు. పేరుమార్పుపై జూనియర్ ఒక ట్వీట్ చేశారు. నిజానికి ఆ ట్వీట్ ఎందుకు చేశారో కనీసం జూనియర్ కైనా క్లారిటీ ఉందో లేదో. ఆ ట్వీట్ గురించే అనిల్ మాట్లాడుతూ ఎన్టీయార్ నుండి ముఖ్యమంత్రి పదవిని, పార్టీని లాగేసుకున్నపుడు ఈ పౌరుషం ఏమైందని జూనియర్ ను నిలదీశారు.

అప్పట్లో చిన్నపిల్లలని అనుకున్నా మరి పెద్దోళ్ళయిన తర్వాత అయినా పార్టీని చంద్రబాబు దగ్గరనుండి లాగేసుకోవాలి కదా ? అంటూ ప్రశ్నించారు. నిజానికి ఇలాంటి ప్రశ్నలతో జూనియర్ ను రెచ్చగొట్టాల్సిన అవసరం అనిల్ కు ఏమీ లేదు. అయినా అసందర్భంగా జూనియర్ ను రెచ్చగొట్టేట్లుగా ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధం కావటం లేదు. చంద్రబాబు నుండి టీడీపీని లాగేసుకోవటం జూనియర్ వల్ల కాదు. అనవసరమైన విషయాలను మాజీ మంత్రి కెలుకుతున్నట్లే అనుమానంగా ఉంది.

ఆ రోజుల్లో ఎన్టీఆర్ స్ధానంలో చంద్రబాబు సీఎం ఎలా అయ్యారనేది అందరికీ తెలుసు. కాబట్టి అప్పటి విషయాలను గుర్తుచేసి ఇపుడు జూనియర్ ను రెచ్చగొట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అనిల్ తెలుసుకోవాలి. ఇక విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినపుడు నందమూరి కుటుంబం నుండి ఒక్కరైనా పొగిడారా అని అడగటం కూడా మాజీమంత్రి అవివేకమే. ఎందుకంటే దగ్గుబాటి పురందేశ్వరి ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారు. పురందేశ్వరి తప్ప ఇంకెవరూ పెద్దగా మాట్లాడలేదు. ఇక ఆరోగ్యశ్రీకి వైఎస్సార్ పేరు తీసేసి ఎన్టీయార్ ఆరోగ్య శ్రీగా మార్చినపుడు జగన్మోహన్ రెడ్డి కానీ లేదా వైసీపీ నేతలు కానీ ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. కాబట్టి పాత విషయాలను అనవసరంగా ప్రస్తావించటం ద్వారా మాజీ మంత్రి జూనియర్ ను రెచ్చగొడుతున్నట్లే ఉంది.