ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి పాలకులు ఏం సాధిస్తారని జనసేన అధినేత పవన్ ప్రశ్నించారు. ఎన్టీఆర్ బదులు వైఎస్‌ఆర్ పెడితే వసతులు మెరుగవుతాయా అని నిలదీశారు. వసతుల కల్పన వదిలేసి పేర్లు మార్చడం అర్థంలేని చర్య అని వ్యాఖ్యానించారు. కొత్త వివాదాలు సృష్టించేందుకు ycp ప్రభుత్వం ఈ పని చేసిందని మండిపడ్డారు.
ఎన్టీఆర్ బదులుగా వైఎస్సార్ అని పెడితే విశ్వ విద్యాలయంలోనూ, రాష్ట్రంలోనూ వసతులు మెరుగవుతాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైద్య వసతులు ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని విమర్శించారు. ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ తగినన్ని పడకలు, సిబ్బంది అందుబాటులో లేరని మండిపడ్డారు. మెరుగుపరచాల్సిన మౌలిక వసతులను వదిలిపెట్టి విశ్వ విద్యాలయం పేరు మార్చడంలో అర్థం లేదని మండిపడ్డారు.
ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకే.. కొత్త వివాదాలు సృష్టించే ప్రయత్నమే చేస్తున్న పని అని విమర్శించారు. పాలకులు మారినప్పుడల్లా పేర్లు మార్చుకుంటూ వెళ్తే ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్నారు. పేర్లు మార్చాలనుకుంటున్న ప్రభుత్వం.. బ్రిటిషర్ల పేరు ఉన్న విశాఖ కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరు ఎందుకు మార్చరని ప్రశ్నించారు. ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రజ్ఞుల్లో ఒకరైన యల్లాప్రగడ సుబ్బారావు పేరును ఎందుకు పెట్టలేదని నిలదీశారు. ఇంట్లో వాళ్ల పేర్లు ప్రజల ఆస్తులకు పెట్టే ముందు.. ప్రజల కోసం జీవితాలను దారపోసిన మహనీయుల గురించి పాలకులు తెలుసుకోవాలని హితవు పలికారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates