వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేస్తారు ? పార్టీలో నేతలతో పాటు ఆయన అభిమానుల్లో విపరీతంగా వినిపిస్తున్న ప్రశ్నిదే. తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయమంటే కాదు తమ దగ్గరే పోటీ చేయాలని డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలివే అని చాలా నియోజకవర్గాల పేర్లు వినబడ్డాయి. ఒకసారి భీమిలి అని, మరోసారి పిఠాపురం అని, కాదు కాదు మళ్ళీ భీమవరం, గాజువాక నుండే పోటీచేస్తారని చెబుతున్నారు.
ఇవన్నీ కాదు కాకినాడ నుండి పోటీ చేయడం ఖాయమంటున్నారు. రీసెంటుగా నరసాపురం అసెంబ్లీయే ఖాయమంటున్నారు. ఇంతకముందు పవన్ తిరుపతి నుంచి పోటీ చేస్తే లక్ష ఓట్ల మెజారిటీ తెప్పిస్తామని తిరుపతి నేతలు బంపరాఫర్ ఇచ్చారు. ఇవన్నీ సరిపోవన్నట్లుగా తాజాగా విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గం నుండే పవన్ పోటీ చేయబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కూడా తాను రెండు నియోజకవర్గాల్లో పోటీచేయాలని పవన్ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎలాగూ రెండు నియోజకవర్గాల్లో పోటీకి రెడీ అవుతున్నారు కాబట్టి అందులో ఒకటి కచ్చితంగా విశాఖ ఉత్తరం ఉంటుందని నేతలంటున్నారు. ఇక్కడే ఎందుకంటే ఇది పూర్తిగా అర్బన్ ప్రాంత నియోజకవర్గం. అలాగే కాపులు చాలా ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక్కడ పోటీ చేస్తే గెలుపు ఖాయమని కూడా నేతలంటున్నారు. విశాఖ ఉత్తరంతో పాటు మరో నియోజకవర్గంలో కూడా పవన్ పోటీ చేసే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే భీమవరం, గాజువాకల్లో కూడా పోయినసారి ఇవే లెక్కలు వేసుకుని పవన్ పోటీ చేశారు. గాజువాకలో జనసేనకు అత్యధికంగా 95 వేల మంది సభ్యులున్నారు. ఇక భీమవరంలో కాపులు గణనీయంగా ఉన్నారు. ఈ లెక్కలతోనే గెలుపు గ్యారెంటీ అని పోటీచేస్తే రెండు చోట్లా బోల్తాపడ్డారు. మళ్ళీ జనసేన నేతలు అవే లెక్కలు చెబుతున్నారు. సో వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ రెండు నియోజకవర్గాల్లో పోటీచేయబోతున్నారా ? అయితే.. ఇక్కడో విషయం గమనించాలి. గత ఎన్నికల్లో డబ్బులు పంచకుండా ఎన్నికలకు పోవడం వల్లే పవన్ ఓడారనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎంత చెప్పినా అధినేత వినలేదని, ఓటర్లకు డబ్బులు పంచకుండా గెలవడం నేటిరోజుల్లో సాధ్యం కాదని చెప్పినా వినలేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చిన్న అమౌంట్ పంచినా భారీ మెజారిటీతో గెలిచేవారని అంటున్నారు. మరి ఈసారి ఏంచేస్తారు?
Gulte Telugu Telugu Political and Movie News Updates