సామాన్యుల సందేహాలకు టీ గవర్నర్ సమాధానాలు చూశారా?

రాజకీయాల్లో అవకాశం అన్నది ఇవ్వకూడదు. ఎవరో దూసుకెళ్లారని ఫీల్ కావటంలో అర్థం లేదు. ఎందుకంటే.. అలాంటి పరిస్థితి ఇచ్చినోళ్లది తప్పు కానీ.. దాన్ని వినియోగించుకునే వారిని తప్పు పట్టటంలో అర్థం లేదు. ఎక్కడిదాకానో ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై చురుగ్గా ఉండటమేకాదు.. పలుమార్లు వివిధ శాఖల అధికారుల్ని రాజ్ భవన్ కు పిలిపించి.. వివిధ అంశాల మీద రివ్యూ భేటీలు నిర్వహించటం తెలిసిందే.

గవర్నర్ చురుగ్గా వ్యవహరిస్తున్నారని.. ఆమె కావాలనే ఇలా చేస్తున్నారంటూ తెలంగాణ అధికారపక్ష నేతలు కొందరు తప్పు పడుతున్నారు. కానీ.. ఆమెకు అలాంటి పరిస్థితిని కల్పించిందెవరు? అంటే.. ముఖ్యమంత్రి కేసీఆరేనని చెప్పాలి.

ప్రజలకు దూరంగా ఉండటమే కాదు.. తాము ఎదుర్కొనే సమస్యల్ని సీఎం సాబ్ కు చెప్పుకునేందుకు కేసీఆర్ ఎలాంటి అవకాశాన్ని ఇవ్వలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఈ క్రమంలో.. తమ సమస్యల్ని వినేందుకు సిద్ధంగా ఉన్న గవర్నర్ తమిళ సైకి వారు మొరపెట్టుకుంటున్నారు. తనకు ప్రశ్నలు వేసే వారికి గవర్నర్ ఓపిగ్గా సమాధానాలు చెబుతున్నారు.

తాజాగా ట్విట్టర్ లో గవర్నర్ తమిళ సైకు సామాన్యులు వేసిన ప్రశ్నలు.. అందుకు ఆమె చెప్పిన సమాధానాల్నిచూస్తే.. ఆమె ఎంత యాక్టివ్ గా ఉన్నారన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. ఇంతకీ ట్విట్టర్ లో గవర్నర్ తమిళసైను సామాన్యులు ఏం అడిగారు? దానికి ఆమె ఏమని బదులిచ్చారన్నది చూస్తే..

ప్రీతమ్‌: హైదరాబాద్‌లో అత్యంత దయనీయ పరిస్థితులున్నాయి. ప్రైవేట్‌ ఆస్పత్రులు మధ్యతరగతి ప్రజల రక్తాన్ని పీల్చుకు తింటున్నాయి. ఏ ఆస్పత్రిలో కూడా బెడ్లు లేవు. నగరంలో ఇరవై రోజులైనా లాక్‌డౌన్‌ విధించాలి.
గవర్నర్‌: నమోదు చేసుకున్నా.

పాలిటిక్స్‌ ల్యాబ్‌: తెలంగాణ ప్రథమ పౌరురాలిగా కొవిడ్‌ను మీరు సీరియ్‌సగా తీసుకోవాలి.
గవర్నర్‌: నిజమే.

ఇండియన్‌: ఆస్పత్రుల్లో బెడ్లు లేవు. బెడ్‌ల ఖాళీలు చూపించేలా మీరే చొరవ తీసుకోవాలి.
గవర్నర్‌: చర్చిస్తా. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రైవేట్‌ ఆస్పత్రులతో సమావేశమవుతున్నా. ఐసొలేషన్‌ సౌకర్యాల తో పాటు ప్రజల వినతులపైనా చర్చిస్తా. బెడ్లు, బిల్లింగ్‌, టెస్టులు వంటి సమస్యలను పరిష్కరించి, ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో కరోనాను విజయవంతంగా నియంత్రిస్తాం.

స్వాతి: దేవుడా! చాలా వినతులున్నాయి. కఠిన నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి.
గవర్నర్‌: మూడు నెలల నుంచి నేను ఈ పనిలో ఉన్నా. నిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించా. పరిస్థితులపై ఆరా తీశా.

రీతూ: మేడమ్‌.. ప్రభుత్వం టెస్టులు చేయడం లేదు. ట్రాక్‌ చేయటం లేదు. హైదరాబాద్‌ అంతటా కరోనా వ్యాప్తి చెందింది. కానీ, గాంధీ ఆస్పత్రిలోనే వైద్యం చేస్తున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నాయి.
గవర్నర్‌: పరీక్షలు చేయడం.. గుర్తించడం.. వైద్యం చేయడంతోపాటు అవగాహన కల్పించడం, శానిటైజర్లు, మాస్కులు, భౌతిక దూరం పాటించడం, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకునేలా చేయడం, భయభ్రాంతులకు గురికాకుండా చూడటం అవసరం.

సుబ్బు: థర్మల్‌ రీడర్లు, ఆక్సీమీటర్లు ఇంట్లో ఉండాలా…?
గవర్నర్‌: సాధారణ థర్మామీటర్‌ చాలు. ఆక్సీ మీటర్‌ అక్కర్లేదు. లక్షణాల్లేకుండా పాజిటివ్‌గా నిర్ధారణ అయినా.. స్వల్ప లక్షణాలతో కరోనా వచ్చినా ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేదు. అరవై ఏళ్లు నిండినవారు.. బీపీ, షుగర్‌ ఉన్న వాళ్లకు కరోనా సోకితేనే ఆక్సీమీటర్‌ అవసరం.