వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గం లో దగ్గుబాటి చెంచురామ్ పోటీ చేయబోతున్నట్లు సమాచారం. దగ్గుబాటి చెంచురామ్ ఎవరంటే మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొడుకు. చెంచురామ్ టీడీపీ తరపున రంగంలోకి దిగబోతున్నట్లు జిల్లా పార్టీలో బాగా ప్రచారం జరుగుతోంది. మొదటి సొంత నియోజకవర్గమైన పర్చూరు నుండి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. అయితే సిట్టింగులందరికీ టికెట్లు ఇవ్వబోతున్నట్లు చంద్రబాబానాయుడు చేసిన ప్రకటనతో ఆ ప్రచారానికి తెరపడింది.
పర్చూరు నుండి ప్రస్తుతం ఏలూరి సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూడా ఏలూరికే టికెట్ కన్ఫర్మ్ అయినట్లు లెక్క. దాంతో వెంటనే దగ్గుబాటి ఫ్యామిలీ దృష్టి చీరాల మీదకు మళ్ళిందట. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచిన కరణం బలరాం ప్రస్తుతం వైసీపీకి దగ్గరైపోయారు. ఈయన కొడుకు కరణం వెంకటేష్ వైసీపీలో చేరి చాలా యాక్టివ్ గా ఉన్నారు.
కాబట్టి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున వెంకటేషే పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా చీరాలలో పోటీచేయబోయేది తానే అని వెంకటేష్ కూడా ప్రకటించారు. కాబట్టి టీడీపీ తరపున ఇక్కడ అవకాశముంది కాబట్టి దగ్గుబాటి ఫ్యామిలీ ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టిందట. నిజానికి దగ్గుబాటి ఫ్యామిలి ప్రస్తుతం టీడీపీతో అంటీ ముట్టనట్లగానే ఉంది. వైసీపీ నుండి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్చూరులో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నుండి పెద్దగా యాక్టివ్ గా లేరు. ఇదే సమయంలో ఆయన భార్య దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో ఉన్నారు. ఇపుడు ఆమెకు బీజేపీలో ప్రాధాన్యత తగ్గిపోతోంది.
తొందరలోనే ఆమె పార్టీలో నుండి బయటకు వచ్చేసే అవకాశం ఉందనే ప్రచారం తెలిసిందే. ఒకవేళ ఆమెగనుక బీజేపీలో నుండి వచ్చేస్తే బహుశా కుటుంబం అంతా టీడీపీలో చేరే అవకాశముంది. అప్పుడు దగ్గుబాటి చెంచురామ్ కు చీరాల టికెట్ ను ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే చెంచురామ్ ఇటు చంద్రబాబు, అటు లోకేష్ తో టచ్ లోనే ఉన్నారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates