ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. తమకు.. 150 సీట్ల కన్నా ఎక్కువగానే వస్తాయని.. వైసీపీ నాయకులు తరచుగా చెబుతున్నారు. ఇక, సీఎం జగన్ అయితే.. మరో రెండు అడుగులు ముందుకు వేసి.. ఇన్ని పథకాలు అమలు చేస్తున్నాం కాబట్టి.. మనకు 175 కు 175 సీట్లు ఎందుకు రావని.. పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నారు. వారికి సరికొత్త టార్గెట్లు కూడా పెడుతున్నారు. అయితే.. ఈ లెక్కల విషయంపై తాజాగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో అధికారపార్టీ వైసీపీ ఎన్ని సీట్లు గెలవబోతోందనే విషయంపై పవన్ కళ్యాణ్ లెక్కలు చెప్పారు. తాజాగా ఆదివారం మంగళగిరిలో జరిగిన జనసేన లీగల్‌సెల్ సమావేశం లో పవన్ మాట్లాడు తూ… ఓ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 47 నుంచి 67 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వైసీపీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. హామీలు నెరవే ర్చని పార్టీకి, ప్రభుత్వానికి చట్టాలు చేసే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే ప్రజలు వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పవన్ చెప్పారు. ఆ ఆగ్రహమే వారిని 2014 స్థాయికి దిగజార్చుతుందని.. చెప్పుకొచ్చారు. సమస్యలపై ప్రశ్నించేందుకు వేదిక కావాలనిపించిందన్నా రు. ప్రశ్నించేందుకు, సేవ చేసేందుకే పార్టీ స్థాపించినట్లు వివరించారు. గెలిచేవరకు మళ్లీ మళ్లీ దెబ్బలు తినడానికి సిద్ధమని పవన్ స్పష్టం చేశారు. తన జీవితంలో చేసిన మంచి పని పార్టీ పెట్టడమన్నారు. 2019లో ప్రజలు ఏ ఉద్దేశంతో వైసీపీకి ఓటు వేశారో గానీ.. దాని పర్యావసానం ఇప్పుడు అనుభవిస్తున్నారని పవన్ కల్యాణ్ విమర్శించారు.
ఏపీకి నేడు రాజధాని లేకుండా పోయిందని పవన్ అన్నారు. తానుఎక్కడికి వెళ్లినా.. మీ రాజధాని ఎప్పుడు కడుతున్నారు? ఎక్కడ కడుతున్నారని.. ప్రశ్నిస్తున్నారని ఆయన అన్నారు. చట్ట సభల్లో మాట ఇచ్చి వెనక్కిపోతే ఇక విలువేముందని ప్రశ్నించారు. వేల ఎకరాలు వద్దు.. చిన్న రాజధాని చాలని మిత్రపక్షంగా చెప్పానన్నారు. ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి 30 వేల ఎకరాలు అవసరం అన్నారని.. ఇక్కడే ఇల్లు కట్టానని.. అమరావతిని అభివృద్ధి చేస్తానని అన్నారని తెలిపారు. ఓట్లు వేయించుకున్నాక మాట తప్పి మోసం చేశారని మండిపడ్డారు. 3 రాజధానుల పేరుతో వివాదం చేసింది ఎవరని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates