అమ‌రావ‌తిపై ఏపీ స‌ర్కారుకు ఎదురు దెబ్బ‌ !

ఏపీ రాజ‌ధాని న‌గ‌రం అమరావతిని మున్సిపాల్టీగా మార్చే విష‌యంలో స‌ర్కారుకు భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. ఈ నెల 12 నుంచి నిర్వ‌హించిన గ్రామ స‌భ‌లు ముగిశాయి. అయితే.. ఈ గ్రామసభల్లో రైతులు ఎవ‌రూ కూడా మునిసిపాలిటీకి.. అనుకూలంగా చెయ్యెత్త‌లేదు. పైగా.. మునిసిపాలిటీ కాదు.. మ‌హా సిటీ కావాల‌ని డిమాండ్ చేశారు. తుళ్లూరు మండలంలోని 19 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాలు కలిపి మున్సిపాల్టీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేసి గ్రామసభలు ఏర్పాటు చేసింది.

ఏపీ ప్రభుత్వ ఉద్దేశం ఏమైనప్పటికీ రాజధాని రైతులు.. మరోసారి పట్టుదలను, ఐకమత్యాన్ని చాటిచెప్పారు. 22 గ్రామాల్లోనూ అధికారులు సభలు నిర్వహించగా.. అన్ని గ్రామాల్లోనూ ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించారు. బోరుపాలెంలో ఇద్దరు, లింగాయపాలెం, నెక్కళ్లు, శాఖమూరులో ఒక్కొక్కరు చొప్పున మున్సిపాల్టీకి అనుకూలమని చేతులెత్తారు. 22 గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో ప్రభుత్వ నిర్ణయాన్ని తిప్పికొట్టారు. గ్రామసభల్లో స్థానికులు తమ అభ్యంతరాలను గట్టిగానే చెప్పారు. తాము భూములిచ్చింది రాజధాని కోసమని మున్సిపాల్టీగా మార్చడం వల్ల తమకు న్యాయం జరగదని స్పష్టం చేశారు.

మహాపాదయాత్రకు అమరావతి రైతులు, మహిళలు ముహూర్తం పెట్టినరోజే ప్రభుత్వం గ్రామసభలు పెట్టింది. ప్రభుత్వ ఎత్తుగడను అర్థం చేసుకున్న రైతులు.. 22 గ్రామాల్లోనూ పాదయాత్రకు వెళ్లనివారితో తమ నిరసన గళాన్ని విన్పించడంలో విజయం సాధించారు. ఓవైపు అభ్యంతరాలను వ్యక్తం చేస్తూనే… మరోవైపు తమ డిమాండ్ల చిట్టాను అధికారులకు అందజేశారు. 2015లో 3 మండలాల్లో 29 గ్రామాలను ల్యాండ్ పూలింగ్ కింద అప్పటి ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. ఆ ఒప్పందం ప్రకారం అభివృద్ధి జరగాలని రైతులు కోరారు.

మున్సిపాల్టీ ఏర్పాటుకు తగిన జనాభా నిష్పత్తి లేనప్పటికీ ప్రభుత్వం మున్సిపాల్టీని అమలుచేయడానికి ఎందుకు ముందుకు వచ్చిందని రైతులు ప్రశ్నించారు. రాజధాని పనులు ఆగిపోవడంతో వ్యవసాయ కూలీలకు ఉపాధి కరవైందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాల్టీగా మారిస్తే ఉపాధి హామీ పనులు నిలిచిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు జరపాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందని రైతులు పేర్కొన్నారు. ఇప్పుడు రాజధాని గ్రామాలను ముక్కలు చెక్కలు చేయడం ద్వారా కోర్టు తీర్పును ధిక్కరించినట్లవుతుందని రైతులు చెప్పారు.

అసలు ప్రజలు కోరుకుండానే.. ఎలాంటి తీర్మానం చేయకుండానే ప్రభుత్వం మున్సిపాల్టీగా మార్చడం వెనుక ఉద్దేశమేమిటని రైతులు ప్రశ్నించారు. 22 గ్రామసభల్లోనూ ప్రజలు మున్సిపాల్టీ వద్దంటూ.. రాజధాని నిర్మాణం కావాలంటూ చేసిన తీర్మానాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అధికారులు తెలిపారు. ఇక‌, దీనిపై స‌ర్కారుఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.