మునుగోడు ఉపఎన్నికలో గెలుపు అన్ని పార్టీలకు అత్యంత ప్రతిష్టగా మారింది. టీఆర్ఎస్ సంగతి పక్కన పెట్టేస్తే కాంగ్రెస్, బీజేపీలకు మరీ ప్రతిష్టగా మారింది. కారణం ఏమిటంటే ఇక్కడ ఎంఎల్ఏగా ఉండి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కాంగ్రెస్ నేతే కాబట్టి. సో తన సీటును మళ్ళీ గెలిపించుకోవటం కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు రేవంత్ రెడ్డికి బాగా ప్రతిష్టగా మారింది.
ఇదే సమయంలో కాంగ్రెస్ ఎంఎఏగా రాజీనామా చేసి బీజేపీలో చేరి మళ్ళీ పోటీచేస్తున్నారు కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి కూడా గెలుపు అత్యంత ప్రతిష్టాత్మకమైంది. సరే రాజగోపాల్ వ్యవహారం పక్కనపెట్టేస్తే రేవంత్ కు మాత్రం ఉపఎన్నిక గెలుపు వ్యక్తిగతంగా కూడా ప్రతిష్టనే చెప్పాలి. ఎందుకంటే రేవంత్ భవిష్యత్తు ఉపఎన్నిక గెలుపుతోనే ముడిపడున్నది. అందుకనే నియోజకవర్గంలోని అన్నీ మండలాలకు కీలకమైన, తనకు బాగా నమ్మకం ఉన్న నేతలనే రేవంత్ ఇన్చార్జీలుగా నియమించారు.
తమకు బాధ్యతలు అప్పగించిన మండలాల్లో పార్టీకి మెజారిటి సాధించిన వారికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఖాయం చేస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరీ హామీ గెలుపుకోసమే ఇచ్చారా ? లేకపోతే నిజంగానే టికెట్లిప్పించే ఉద్దేశ్యంతో చేశారా అన్నదే తెలీటంలేదు. ఎందుకంటే పీసీసీ అధ్యక్షుడు అయినంత మాత్రాన ఎవరికీ టికెట్ ఇప్పిస్తాననే హామీ చెల్లదు. ఒక్కోసారి పీసీసీ అధ్యక్షుడు సిఫారసులను కూడా అధిష్టానం పట్టించుకోదు.
మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్ధిగా రేవంత్ సిఫారసు చేసిన నల్లమిల్లి కృష్ణారెడ్డిని కాదని అధిష్టానం పాల్వాయి స్రవంతికి టికెట్ ఇచ్చింది. ఇక్కడే రేవంత్ రికమెండేషన్ చెల్లలేదు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఏమి చెల్లుతుంది ? ఏవో కొన్ని సీట్లలో రేవంత్ చెప్పినవారికి అధిష్టానం టికెట్లు ఇవ్వవచ్చంతే. మొత్తం 119 నియోజకవర్గాల్లోను తాను చెప్పినవారికే టికెట్లివ్వాలని రేవంత్ పట్టుబడితే జరిగేదికాదు. ఏదో ఇపుడు గండం గడిచేందుకు రేవంత్ హామీలిస్తే ఇచ్చుండచ్చు. అసలు వాస్తవం ఏమిటో నేతలకు తెలీకుండానే ఉంటుందా ?