నెల్లూరు ఫైర్ బ్రాండ్ క‌నిపించ‌డం లేదే..!

అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మై.. రెండు రోజులు గ‌డిచిపోయాయి. అధికార పార్టీ త‌ర‌ఫున బ‌లంగా మాట్లాడే వారి కోసం..అధినేత జ‌గ‌న్ ఎదురు చూస్తున్నారు. వెతికి మ‌రీ తెచ్చుకుని.. స‌భ‌లోమైకు ఇస్తున్నారు. అయితే.. ఇంత జ‌రుగుతున్నా.. నెల్లూరు కు చెందిన ఫైర్ బ్రాండ్‌.. మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. నిజానికి ఆయ‌న మంత్రిగా ఉన్నా.. అంత‌కు ముందు అయినా.. టీడీపీపై తీవ్ర‌స్థాయిలోవిమ‌ర్శ‌లు చేసేవారు.

ముఖ్యంగా చంద్ర‌బాబు ఆయ‌న కుమారుడు లోకేష్‌ల‌పై విరుచుకుప‌డేవారు. అయితే.. ఆయ‌న మంత్రి ప‌ద‌వి పోయిన త‌ర్వాత‌.. అనూహ్యంగా లోక‌ల్‌గా ఉన్న సొంత పార్టీనాయ‌కుల‌తోనే సై అంటే.. సై అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. త‌ర్వాత‌.. ఎందుకో.. ఒక్కసారిగా సైలెంట్‌క్ష అయిపోయారు. ఇక‌, ఇప్పుడు అసెంబ్లీలోనూ ఆయ‌న వాయిస్ వినిపించ‌డం లేదు. ఇప్పుడు ఈ విష‌య‌మే..చ‌ర్చ‌కు వ‌స్తోంది. మంత్రి ప‌ద‌వి లేద‌నే బెంగ ప‌ట్టుకుంద‌ని.. కొంద‌రు గుస‌గుస‌లాడుతున్నారు.

మ‌రికొంద‌రు.. సొంత పార్టీ నేత‌లే త‌న‌ను ప‌క్క‌న పెడుతున్నార‌నే ఆవేద‌న‌లో ఉన్నార‌నిచెబుతున్నారు. అదేస‌మ‌యంలో అధినేత జ‌గ‌న్‌ను ఆయ‌న ఎంతో అభిమానించార‌ని.. కానీ, జ‌గ‌నే ఇప్పుడు ఆయ‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అందుకే మౌనంగా ఉంటున్నార‌ని చెబుతున్నారు. ఏదేమైనా.. అనిల్ వాయిస్ ఎక్క‌డా వినిపించ‌క‌పోవ‌డంతో వైసీపీలో లోటు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని చెబుతున్న‌వారు మాత్రం పెరుగుతున్నారు.

రాజ‌కీయాల్లో వివాదాలు.. విభేదాలు.. అసంతృప్తులు కామ‌నే అయినా.. మంత్రి ప‌ద‌వి ద‌క్క‌ని వారు మాత్రం ఇప్పుడు పూర్తిగా సైలెంట్ కావ‌డం గ‌మ‌నార్హం. గతంలో పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, ఉద‌య భాను, కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి వంటివారు.. ఫైర్ అయ్యేవారు.కానీ, ఇప్పుడు వారంతా కూడా మౌనంగా ఉంటున్నారు. దీనిని బ‌ట్టి.. వైసీపీలో ఇంకా అసంతృప్తి చ‌ల్లార‌లేద‌నే వాద‌న బలంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.