రాజకీయాలు ఎప్పుడూ.. ఒకేలా ఉండవు. తిరుగులేదని చెప్పుకొన్న నాయకులు కూడా ప్రజల మనసులో చోటు సంపాయించుకోకపోతే.. తర్వాత కాలంలో కాల గర్భంలో కలిసిపోయిన పరిస్థితి కనిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే సూత్రం.. గుంటూరుజిల్లాలో కీలక నాయకుడు.. వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నరాయపాటి సాంబశివరావు విషయంలోనూ జరుగుతోందని అంటున్నారు. ప్రస్తుతం ఆయన వయోవృద్ధుడు అయిపోయారు. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు.
మరోపక్క ఆయన కుమారుడు.. రాయపాటి రంగారావు.. పోటీ చేయాలని అనుకున్నారు. కానీ.. ఆయన ప్రజల మధ్య ఉండడం లేదు. పైగా.. పార్టీ కార్యదర్శిగా ఉన్నప్పటికీ.. ఆయన ఎలాంటి కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. వాస్తవానికి గుంటూరు జిల్లా నాయకులు అందరూ కూడా.. నారా లోకేష్‌కు మద్దతు తెలుపుతున్నారు. దాదాపు జిల్లా మొత్తంపైనా నారా లోకేష్ ఆధిపత్యం ఉంది. ఈ సమయంలో అందరూ ఆయనకు జై కొడుతున్నారు. ఎలాగైనా సరే.. నారా లోకేష్‌ను వచ్చే ఎన్నికల్లో గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ సమయంలో లోకేష్‌కు అండగా నిలిచి.. తను ఎంచుకున్న నియోజకవర్గంలో పోటీ ఇచ్చేలా వ్యవహ రించాల్సిన రంగారావు.. ఎక్కడా కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో రంగారావు.. పోటీ చేయాల్సి ఉంది. అయితే.. అప్పటి పోటీ తీవ్రంగా ఉంటుందని భావించిన చంద్రబాబు.. ఆయనను తప్పించారు. దీంతో ఒత్తిడి తెచ్చిన రాయపాటి నరసరావుపేట పార్లమెంటు సీటును దక్కించుకున్నారు. అయితే..యువ నేత, వైసీపీ నాయకుడు.. లావు చేతిలో ఆయన ఘోరంగా ఓడిపోయారు.
ఇక, అప్పటి నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో ఇంటికే పరిమితం అయ్యారు. ఇక, ఆ తర్వాత.. రంగారావుకు సత్తెనపల్లి సీటు ఇవ్వాలని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. అదే సమయంలో నరసరావుపేట నియోజకవర్గాన్ని కూడా తమ కుటుంబానికే.. ఇవ్వాలని.. పట్టుబట్టారు. రెంటు సీట్లు కాదు.. ఒకటి తీసుకోమని.. చంద్రబాబు పదే పదే చెప్పారు. ఈ విషయంలో ఎటూ తేల్చుకోని.. రంగారావు.. అప్పటి నుంచి పార్టీపై అలకబూనారు.
ఫలితంగా.. ఇప్పుడు అటు సత్తెనపల్లి.. ఇటు నరసరావుపేటలను కూడా పోగొట్టుకున్నారని అంటున్నారు పార్టీ నాయకులు.. ఈ రెండు చోట్ల కూడా చంద్రబాబు వేరేవారికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని.. సత్తెనపల్లిని కోడెల శివప్రసాదరావు తనయుడు.. శివరామకృష్ణ లేదా మరో ఇద్దరు నేతల్లో ఎవరో ఒకరికి ఇవ్వనున్నారని సమాచారం. ఇక, నరసారావుపేట విషయంలో తేల్చాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates