ఎమ్మెల్సీ క‌విత‌.. ఈడీ నోటీసులు.. ఖండ‌న‌!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోందని మీడియా చానెళ్ల‌లో తెగ ప్ర‌చారం జ‌రుగుతోంది. గతంలో కవిత పీఏ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్ర‌వారం కవిత అకౌంటెంట్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. కాగా.. కవితకు కూడా ఈడీ నోటీసులు పంపించిందని.. పెద్ద ఎత్తున దుమారం రేగింది. కీల‌క‌మైన మీడియా ఛానెళ్లు అన్నింటిలోనూ.. ఈ వార్త ప్ర‌ముఖంగా బ్రేకింగ్ న్యూస్ రూపంలో వ‌చ్చింది. ప్రస్తుతం కరోనా సోకడంతో ఆమె క్వారంటైన్‌లో ఉండటంతో కవిత సహాయకులకు ఈడీ నోటీసులు అందజేసిందని, ఈ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోందనేది మీడియా సంస్థ‌ల ప్ర‌చారం. అయితే.. ఈ విష‌యాన్ని క‌విత క్ష‌ణాల్లోనే ఖండించారు. మీడియాపై ఫైర‌య్యారు.

అస‌లు ఏం జ‌రిగింది?

హైదరాబాద్‌లో పలువురు వ్యాపార వేత్తలు, చార్టెడ్ అకౌంట్ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అదేవిధంగా ఢిల్లీ, ఏపీ, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లోనూ ఢిల్లీ లిక్క‌ర్ కుంబ‌కోణంతో సంబంధం ఉన్న వారిని కూడా వ‌దిలి పెట్ట‌లేదు. ఏపీ ఎంపీ.. మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత పర్సనల్ ఆడిటర్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని దోమలగూడలోని అరవింద్ నగర్ శ్రీ సాయికృష్ణ రెసిడెన్సీలో కవిత ఆడిటర్ నివాసముంటున్నారు.

నలుగురు ఈడీ అధికారుల నేతృత్వంలో సాయి కృష్ణా రెసిడెన్సీలోని మొదటి అంతస్తులో చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. బుచ్చిబాబు గతంలో కవితకు అకౌంటెంట్‌గా ఉన్నారు. అలాగే.. గచ్చిబౌలిలో అభినవ్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. కాగా.. గతంలోనూ ఎమ్మెల్సీ క‌విత పీఏగా ప‌నిచేస్తున్న అభిషేక్ రావు ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వ‌హించ‌డం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేప‌థ్యంలో క‌విత‌కు ఈడీ నోటీసులు జారీ చేసింద‌నేది మీడియా వ‌ర్గాల ప్ర‌చారం.

క‌విత ఖండ‌న‌..

మ‌ద్యం కుంభకోణం వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే తనకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. తనకు ఎలాంటి నోటీసులు రాలేదని కవిత స్పష్టం చేశారు. ఢిల్లీలో కూర్చుని కొందరు మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. మీడియా తమ సమయాన్ని నిజాలను చూపించేందుకు ఉపయోగించాలని కోరారు. టీవీ వీక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేసేందుకు ప్ర‌య‌త్నించాల‌న్నారు. అయితే.. త‌న మాజీ అకౌంటెంట్ స‌హా స‌హాయ‌కుల ఇళ్ల‌లో ఈడీ సోదాల‌ను మాత్రం క‌విత ఖండించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.