బీజేపీ డబల్ గేమ్ ఆడుతోందా ?

రాజధాని అంశంలో ఏమి మాట్లాడాలో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలో బీజేపీకి అర్థం కాక బుర్ర తిరిగిపోతున్నట్లుంది. ఒకసారేమో ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని డిమాండ్ చేస్తారు. మరోసారేమో రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదే అంటారు. ఈ మధ్యేమో అమరావతి డిమాండుకే కమలనాథులు జై కొడుతున్నారు. న్యాయస్థానం టు దేవస్ధానం యాత్ర సందర్భంగా అమరావతికే బీజేపీకి జై కొట్టింది. తాజాగా అమరావతి టు అరసవల్లికి మొదలైన పాదయాత్రకు కూడా బీజేపీ జై కొట్టింది.

అయితే తాజాగా ప్రొద్దుటూరులో రాయలసీమ జోనల్ స్ధాయి బీజేపీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ హైకోర్టు కర్నూలులోనే పెట్టాలని డిమాండ్ చేశారు. డిమాండుతో సరిపెట్టుకోకుండా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయించే బాధ్యత తామే తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. అలాగే కొద్దిరోజుల క్రితం ఉత్తరాంధ్ర పర్యటనలో మాట్లాడుతు విశాఖను ప్రభుత్వం ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలన్నారు.

ఎగ్జిక్యూటివ్ క్యాపిటిల్ గా విశాఖను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అడిగితే సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. అంటే బీజేపీ నేతల తీరు ఎలాగుందంటే ఏ రోటికాడ ఆ పాట పాడాలన్నట్లుగా ఉంది. అమరావతి ప్రాంతంలో మాట్లాడినపుడు అమరావతి మాత్రమే రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తారు. మొత్తానికి వీర్రాజు తాజా మాటలు విన్నతర్వాత రాజధానిపై బీజేపీలో ఎంతటి అయోమయం ఉందో అర్ధమైపోతోంది. అసలు రాజధానుల ఏర్పాటు తమ పరిధిలో లేదని కేంద్రం రెండుసార్లు హైకోర్టుకిచ్చిన అఫిడవిట్లలోనే స్పష్టం చేసింది.

రాజధాని ఏర్పాటు అన్నది పూర్తిగా రాష్ట్రం పరిధిలోని అంశమే అని చెప్పిన విషయాన్ని బీజేపీ నేతలు మరచిపోయినట్లున్నారు. జనాల ఆకాంక్షల ప్రకారం అమారవతే ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తున్నారా అంటే అదీలేదు. ఏకైక రాజధాని అంటేనే హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం అన్నీ అమరావతిలోనే ఉంచాలని కదా అర్ధం. మరి ఇపుడు ప్రొద్దుటూరులో మాట్లాడిన సోము వీర్రాజు కర్నూలులో హైకోర్టు ఉండాలని డిమాండ్ చేయటంలో అర్ధమేంటి ?