మూడు రాజధానుల ముచ్చట లేనట్టేనా? ప్రస్తుతం జగన్ పాలనా కాలంలో మూడు రాజధానులు పూర్తి అయ్యే పరిస్థితి లేదా? అంటే..తాజాగా మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి.. ఏపీ ప్రభుత్వం 2020 నుంచి కూడా మూడు రాజధానుల ఊసు ఎత్తుకొచ్చింది. అసెంబ్లీ వేదికగానే మూడు రాజధానుల ప్రస్తావన చేసిన జగన్.. అమరావతిని కేవలం శాసన రాజధానిగానే ఉంచుతామన్నారు.
ఇక, దీనిపై న్యాయ వివాదాలు ముసురుకున్నాయి. రైతులు ఉద్యమం చేశారు. పాదయాత్ర చేశారు.. ప్రస్తుతం కూడా చేస్తున్నారు. అయితే.. ఇంత జరిగినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం తాను మూడు నుంచి వెనక్కి తగ్గే దేలేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఇప్పుడు కూడా ఇదే మాట వినిపిస్తోంది. ఇటీవల హైకోర్టు అమరావతినే రాజధాని చేయాలని.. రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేసి తీరాలని కూడా స్పష్టం చేసిం ది. దీనికి మూడు మాసాల సమయం ఇచ్చింది. అయితే.. ఇది దాటిపోయింది.
అయినా కూడా జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామనే చెప్పుకొచ్చారు. ఇక, రేపోమాపో.. సీఎం జగన్.. విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభిస్తారని కూడా కొందరు నాయకులు క్లూ ఇస్తున్నారు. సో.. ఈ పరిణామాలను బట్టి.. మూడు రాజధానుల ప్రక్రియ… జగన్ హయాంలో ఈ రెండేళ్ల కాలంలోనే జరుగుతుందని అందరూ అనుకున్నారు. అయితే.. తాజాగా మంత్రి గుడివాడ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో మూడురాజధానుల అంశమే ప్రధాన అజెండా అవుతుందని తెలిపారు.
తాము వచ్చే ఎన్నికల్లో వైసీపీ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు తోడు.. మూడు రాజధానుల అంశాన్ని కూడా అజెండాలో పెడతామని.. ప్రజల మధ్యకు తీసుకువెళ్తామని చెప్పారు. సో.. దీనిని బట్టి.. వచ్చే ఎన్నికల వరకు కూడా మూడు రాజధానుల విషయంలో ఎలాంటి అడుగు పడబోదని.. స్పష్టంగా తెలుస్తోంది. మూడు రాజధానుల విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి..అప్పుడు మరోసారి గెలిచి.. ఆ తర్వాత.. న్యాయపరమైన చిక్కులు రాకుండా తమపంతం నెగ్గించుకోవాలని..వైసీపీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సో.. ఇదీ సంగతి!