తెలంగాణలో మంత్రుల వైఖరి చాలా విచిత్రంగా ఉంది. కేసీయార్, మంత్రులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న కారణంగా వైఎస్ షర్మిలపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మంత్రులు ఫిర్యాదు చేశారు. శాసనసభ్యుల గౌరవాన్ని కించపరిచేట్లుగా షర్మిల ఆరోపణలు చేస్తున్నారని ఐదుగురు మంత్రులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటామని, సభ్యుల హక్కులను పరిరక్షిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు.
మంత్రులిచ్చిన ఫిర్యాదును స్పీకర్ వెంటనే సభాహక్కుల ఉల్లంఘన కమిటికి పంపారు. స్పీకర్ సిఫారసు ఆధారంగా కమిటీ బుధ లేదా గురువారాల్లో సమావేశమయ్యే అవకాశముంది. ఇదే విషయమై ఇఫ్పటికే మరో మంత్రి నిరంజన్ రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రాజకీయంగా అనేకమంది అనేకమందిపై ఏవేవో ఫిర్యాదులు చేస్తునే ఉంటారు. రాజకీయంగా ఒకరిపై మరొకరు చేసుకునే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ ఉండవు.
ఏదో రాజకీయంగా ప్రత్యర్ధులపై బురదచల్లటమే టార్గెట్ గా మీడియా సమావేశాల్లోను ఇతర సందర్భాల్లోను ఆరోపణలు చేస్తుంటారు. కేసీయార్ మీద బీజేపీ చీఫ్ బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఏమున్నాయి ? అలాగే నరేంద్ర మోడీ మీద కేసీయార్ తో పాటు మంత్రులు చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. మరి వాటన్నింటికీ ఆధారాలుండే ఆరోపణలు చేస్తున్నారా ? నిజంగానే తాముచేసే ఆరోపణలకు ఏవైనా ఆధారాలుండేట్లయితే కచ్చితంగా వాటిని మీడియాకు అందచేస్తారు.
మీడియాకు ఆధారాలు ఇవ్వకుండా సమయం వచ్చినపుడు అన్నీ ఆధారాలను బయటపెడతామని చెప్పారంటేనే ఆరోపణలు చేసేవారి దగ్గర ఆధారాలు లేవని అర్ధమైపోతోంది. రాజకీయంగా చేసుకునే ఆరోపణలు, ప్రత్యారోపణలకు జనాలు కూడా అలవాటు పడిపోయారు. కాబట్టి జనాలు నేతల ఆరోపణలను ఏదో కాలక్షేపానికి వింటున్నారే కానీ నిజంగా ఎవరూ సీరియస్ గా తీసుకోవటం లేదు. ఇంతోటి దానికి సభా హక్కుల ఉల్లంఘనలకు పాల్పడ్డారని షర్మిలపై స్పీకర్ యాక్షన్ తీసుకోవాలని కోరడం విచిత్రంగా ఉంది.