అమరావతి పేరుతో చేస్తున్న పాదయాత్రను విశాఖపట్నంలో అడ్డుకుంటామని మంత్రి సీదిరి అప్పలరాజు హెచ్చరించారు. ఒకవేళ విశాఖపట్నాన్ని పాదయాత్ర దాటినా శ్రీకాకుళం పొలిమేరలోనే అడ్డుకుని తీరుతామని ప్రకటించారు. పలాసలో జరిగిన ఒక సమావేశంలో సీదిరి పై ప్రకటన, హెచ్చరిక చేయటం విచిత్రంగా ఉంది. మంత్రయ్యుండి ఇలాంటి ప్రకటనలు చేయటమే తప్పు. పాదయాత్రలు చేసుకునే హక్కు అమరావతి జేఏసీకి ఉందన్న విషయాన్ని మంత్రి మరచిపోయినట్లున్నారు.
పాదయాత్ర వల్ల శాంతి భద్రతల సమస్య వస్తే అప్పుడు నిర్వాహకులపై పోలీసులే యాక్షన్ తీసుకుంటారు. అంతేకానీ పాదయాత్రను అడ్డుకుంటామని మంత్రే చెప్పటం విచిత్రంగానే ఉంది. అధికార పార్టీ నేతలు పాదయాత్రను అడ్డుకోవటం వల్ల ఎలాంటి ఉపయోగముండదు. అడ్డుకోవటం వల్ల గొడవలు జరిగితే పాదయాత్రకు వైసీపీనే మరింత ప్రచారం చేసినట్లవుతుంది. ఇంతమాత్రందానికి అడ్డుకోవటం, గొడవలు చేయటం వైసీపీకి అవసరమా ?
అమరావతిలో పాదయాత్ర మొదలుపెట్టిన నిర్వాహకులు అరసవల్లికి చేరుకుంటారు. చేరుకుంటే ఏమవుతుంది దర్శనం చేసుకుని వెనక్కు తిరుగుతారు. ఈ మాత్రానికి మంత్రి ఉలిక్కిపడాల్సిన అవసరం లేదు. పాదయాత్ర సజావుగా జరిగితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది లేకపోతే చెడ్డ పేరు వస్తుంది. తమ ప్రభుత్వానికి మంచిపేరు రావాలా ? లేదా చెడ్డ పేరు రావాలా ? అన్నది మంత్రే తేల్చుకోవాలి. పాదయాత్ర గురించి అధికార పార్టీ అసలు పట్టించుకోకపోతే ఎలాంటి సమస్యలుండవన్న విషయాన్ని సీదిరి గుర్తుంచుకోవాలి.
పాదయాత్ర సందర్భంగా నిర్వాహకులు, యాత్రలో పాల్గొన్నవారు ప్రభుత్వంపై ఏవైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్ళకే నష్టం వస్తుంది కానీ అధికారపార్టీకి వచ్చే నష్టం ఏమీలేదు. చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్న ఏకైక అమరావతా ? జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులా అన్నది తేల్చటం జనాలపైనే ఉంది. వచ్చే ఎన్నికల వరకు ఈ విషయాన్ని అందరు పక్కనపెట్టేస్తే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది. పాదయాత్ర చేసినంత మాత్రాన అమరావతే రాజధాని అయిపోదు. ఇదే సమయంలో జగన్ ప్రతిపాదించినంత మాత్రాన మూడు రాజధానుల ఏర్పాటూ సాధ్యంకాదు. మరీమాత్రానికి గొడవలెందుకు ?