రాజకీయాల్లో మార్పులు తప్పవు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటే.. అప్పుడు దానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ముందుకు సాగాల్సిందే. అయితే.. ఈ మార్పు కొందరికి ఇష్టం లేకపోవచ్చు.. అయి నా.. పరిస్థితుల ప్రభావంతో మార్పులకు తలవొంచాల్సిన పరిస్థితి ఇప్పుడు రాజకీయాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు టీడీపీ వల్లభనేని వంశీ మోహన్‌పై ఆధారపడింది. ఆయన కూడా పార్టీకి నిబద్ధతగానే వ్యవహరించారు.
అయితే.. గత చంద్రబాబు ప్రభుత్వంలో తనను పట్టించుకోలేదని.. ఓ కీలకనాయకుడు.. అప్పటి మంత్రి ఆధిపత్య ధోరణి ప్రదర్శించారని.. దీనిని అడ్డుకోవాలని.. చెప్పినా..చంద్రబాబు పట్టించుకోలేదనే ఆగ్రహంతో ఆయన పార్టీని వీడిపోయారు. అధికారికంగా..వైసీపీ జెండా కప్పుకోకపోయినా.. అనధికారికంగా ఆయన వైసీపీనేతగానే ఉన్నారు. పోనీ.. ఎన్నికల సమయానికైనా.. ఆయన పార్టీలోకి వస్తారని.. కొన్నాళ్ల కిందటి వరకు అనుకున్నారు. ఎందుకంటే..కేసులకు భయపడి అలా వ్యవహరించి ఉంటారని.. భావించారు.
కానీ, చంద్రబాబు కుటుంబంపై వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయనను పార్టీలోకి తీసుకోవడం కాదు కదా.. కనీసం.. పార్టీ ఛాయలకు కూడా రానివ్వకూడదని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి ఎవరు పోటీ చేయాలనే అంశం కొన్నాళ్లుగా టీడీపీలో చర్చకు దారితీస్తోంది.. పార్టీ అధినేత చంద్రబాబు దీనికి భిన్నంగా ఆలోచన చేస్తున్నారు. పోటీ చేయడం కాదు.. అసలు గన్నవరంలో వంశీని ఓడించి తీరాలనే నిర్ణయం దిశగా ఆయన పావులు కదుపుతున్నారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను గన్నవరం పంపించాలని చూస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే గద్దెకు సంకేతాలు కూడా పంపించారని.. అక్కడ బలం పెంచుకోవాలని సూచించినట్టు తెలిసింది. అయితే.. చాలా సంవత్సరాలుగా.. తాను గన్నవరంతో బంధాన్నితెంచేసుకున్నానని.. ఇప్పుడు హఠాత్తుగా తనను అక్కడకు పంపితే.. ఎలా అనేది గద్దె చేస్తున్న వాదనగా ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. అయినప్పటికీ..చంద్రబాబు మాత్రం గద్దెను గన్నవరం పంపాలనే నిర్ణయించుకున్నారట. దీంతో గద్దె అనుచరులు తర్జన భర్జన పడుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.