నరసరావుపేట టికెట్ ఫైనల్ అయినట్లేనా ?

తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను అక్కడక్కడ చంద్రబాబునాయుడు ప్రకటించేస్తున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థి ఎంపిక దాదాపు ఖాయమైనా వివిధ కారణాల వల్ల బహిరంగంగా ప్రకటించటం లేదు. ఇలాంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉందని సమాచారం. ఇప్పటికే రాజంపేట, కడప పార్లమెంటు అభ్యర్థులతో పాటు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్ధులను ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇక విషయానికి వస్తే నరసరావుపేట లోక్ సభ స్ధానంలో పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పోటీచేయటం దాదాపు ఖాయమైనట్లేనట. పుట్టా మహేష్ ఎవరంటే కడపజిల్లాలోని మైదుకూరు మాజీ ఎంఎల్ఏ పుట్టా సుధాకరయాదవ్ కొడుకు+యనమల రామకృష్ణుడు అల్లుడు. కోరుకున్న నియోజకవర్గంలో టికెట్ సాధించుకునేందుకు మహేష్ కు ఇంతకన్నా అర్హతలు ఏమికావాలి ? పైగా ఆర్ధికంగా పటిష్టమైన స్ధితిలో ఉండటమే కాకుండా యువకుడు కూడా.

సో అన్నీ కోణాల్లోను కలిసొచ్చి నరసరావుపేట పార్లమెంటులో మహేష్ పోటీచేయటం దాదాపు ఫైనల్ అయినట్లే అనుకోవాలి. నియోజకవర్గంలో బీసీ ప్రధానంగా యాదవ సామాజికవర్గం జనాభా ఎక్కువగా ఉంది. మాచర్ల, గురజాల, వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో యాదవ సామాజికవర్గం ఓట్లు బాగా ఎక్కువగా ఉన్నాయట. ఈ కారణంగా యాదవ సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధినే పోటీలోకి దింపితే గెలుపు గ్యారెంటీ అని సర్వేల్లో తేలిందని సమాచారం. అందుకనే మహేష్ క్యాండిడేచర్ పై చంద్రబాబునాయుడు కూడా కసరత్తు చేశారు.

సో అన్నీ అవకాశాలు సానుకూలంగానే ఉన్నాయి కాబట్టి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున మహేష్ పోటీచేయటం ఖాయమనే అనుకోవాలి. ఇదే సమయంలో యనమలకు అల్లుడే స్వయంగా పోటీ విషయంలో ఆసక్తిగా ఉన్నారంటే వేరే నేతలు టికెట్ విషయంలో ప్రయత్నం చేయటానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే చంద్రబాబు కూడా యనమలను కాదని ఇతరులకు పెద్దగా వెయిట్ ఇవ్వరు కాబట్టి. సో మరో పార్లమెంటు నియోజకవర్గానికి టీడీపీకి గట్టి అభ్యర్ధి దొరికినట్లేనా ?