తెలంగాణలోనూ రాజన్న రాజ్యం తెస్తానంటూ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీని పెట్టిన షర్మిల.. పార్టీతో ప్రజల కు రాజన్న రాజ్యం తెస్తుందో తెలియదు కానీ.. ‘ఫ్రస్టేషన్ రాజ్యం’ మాత్రం తెచ్చేలా ఉన్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఆమె.. ఒకింత అదుపు తప్పి కామెంట్లు కుమ్మరిస్తున్నారు. కొన్నాళ్ల కిందట ఎప్పుడో.. పేరు చెప్పకుండానే.. మంత్రి జగదీశ్వర్‌రెడ్డి.. ‘మరదలు’ అని కామెంట్ చేశారు. అయితే.. అప్పట్లో దీనిపై ఫోకస్ చేయని.. షర్మిల.. రెండు రోజుల కిందట రియాక్ట్ అయ్యారు.
‘ఎవర్రా’ అంటూ.. దూషణలకు దిగారు. ఇక, తాజాగా కూడా ఆమె నోరు పారేసుకున్నారు. తాను తెలంగాణలోనే పుట్టానని, వైఎస్ సంక్షేమ పాలనను తీసుకొచ్చేందుకే పార్టీ పెట్టామని షర్మిల అన్నారు. “నేను ఇక్కడే పుట్టా. ఇక్కడే పెరిగా. ఇక్కడే చదువుకున్నా. ఈ గడ్డ కూడే తిన్నా. తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన తేవడం కోసమే పార్టీ పెట్టా. నాది తెలంగాణ కాదనేది ఎవర్రా? ఇది నా తెలంగాణ, మన తెలంగాణ” అని అదుపు తప్పి వ్యాఖ్యలు చేశారు.
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మహబూబ్‌నగర్ జిల్లాలో సాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇలా ఎందుకు షర్మిల రూట్ తప్పుతున్నారనే విషయంపై నెటిజన్లు కూడా ఆసక్తిగానే రియాక్ట్ అవుతున్నారు. దీనికి ప్రదాన కారణం.. ఆమె పాదయాత్రకు ఆశించిన కవరేజీ రావడం లేదు. ప్రజల్లోనూ ఎక్కడా టాక్ వినిపించడం లేదు. ఇది ఒక కారణమైతే.. ఎన్నికలు సమీపిస్తున్నా.. ఎప్పుడు ఏ క్షణంలో ప్రకటన వస్తుందో తెలియని పరిస్థితి ఉన్నా.. కనీసం పట్టుమని పది నియోజకవర్గాల్లో అయినా.. నాయకులను నిలబెట్టే స్థాయిలో షర్మిల లేరు.
అందుకే.. అన్నీ కలిపి.. ఇలా అక్కసు వెళ్లగక్కుతున్నారని .. అంటున్నారు నెటిజన్లు. అయితే.. ఇవన్నీ వర్కవుట్ కావని.. నిర్మొహమాటంగానే చెప్పేస్తున్నారు. ఎందుకంటే.. తెలంగాణ భూమితో సంబంధం అంటే.. ఇక్కడిఉద్యమంతో సంబంధం ఉండాలి. ఇక్కడి గాలితో నీటితో.. సంబంధం ఉండాలని.. మధ్యలో వచ్చి.. ఇలా సెంటిమెంటును రగిలించేందుకో.. లేక.. సంచలన వ్యాఖ్యలు చేసి.. గుర్తింపు పొందేందుకో ప్రయత్నిస్తే.. ఫలితం ఉండదని వారు నిర్మొహమాటంగానే సెలవిస్తున్నారు. మరి షర్మిల .. అధికారంలోకి రాకముందే.. ఫ్రస్ట్రేషన్‌కు గురైతే.. వచ్చాక.. ఏం చేస్తారో.. అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.