2024 సార్వత్రిక ఎన్నికల్లో జనామోదం పొందాలంటే విపక్షాల కూటమికి సారథిగా విశ్వసనీయమైన వ్యక్తిని నిలబెట్టడం, ప్రజా ఉద్యమం తీసుకురావడం అవసరమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. విపక్ష నేతలు.. వేర్వేరు పార్టీల నాయకులతో వరుస భేటీలు నిర్వహించినా పెద్దగా ఉపయోగం ఉండదని బాంబు పేల్చారు. అసలు అలాంటి సమావేశాల్ని.. విపక్షాల ఐక్యత లేదా రాజకీయంగా సరికొత్త పరిణామంగా చూడరాదని సూచించారు.
బీజేపీని ఎదుర్కోవడమే ప్రధాన అజెండాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు, బిహార్ సీఎం నీతీశ్ కుమార్, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఇతర విపక్ష నేతలతో ఇటీవల వరుస భేటీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఆ సమావేశాలు, చర్చలు క్షేత్రస్థాయిలో రాజకీయ పరిస్థితుల్ని మార్చవని పీకే చెప్పారు. తనకంటే కూడా నీతీశ్ అనుభవజ్ఞుడని పేర్కొన్నారు.
కొందరు నేతలు భేటీ కావడాన్ని, కలిసి ప్రెస్ మీట్లు నిర్వహించడాన్ని తాను ‘విపక్షాల ఐక్యత’లా లేదా ‘రాజకీయంగా సరికొత్త పరిణామం’గా చూడడం లేదని చెప్పారు. ప్రజల్లో ఉద్యమస్ఫూర్తి తీసుకొచ్చి, వారిలో ఓ బలమైన అభిప్రాయం కలిగేలా చేసి, బీజేపీకి మెరుగైన ప్రత్యామ్నాయం అని జనానికి నమ్మకం కలిగించే విశ్వసనీయ వ్యక్తిని కూటమికి సారథిగా నిలబెడితే తప్ప.. ప్రజలు ఓట్లు వేయరని తెగేసి చెప్పారు.
కేసీఆర్ సహా మరికొందరు నేతలతో ఇటీవల జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ భేటీ కావడంపై ప్రశాంత్ కిశోర్ స్పందించారు. “ఆయన(నీతీశ్) బీజేపీతో కలిసి ఉండగా.. ఆ కూటమితో సన్నిహితంగా ఉన్న నేతల్ని కలిసేవారు. ఇప్పుడు ఆయన బీజేపీని విడిచిపెట్టారు. అందుకే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న నేతలతో భేటీ అవుతున్నారు. దీని వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. నిజంగా విజయం సాధించాలంటే మీకు విశ్వసనీయత, ప్రజల నమ్మకం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, ప్రజా ఉద్యమం అవసరం” అని అభిప్రాయపడ్డారు.
2014 నుంచి కాంగ్రెస్ వరుస సంక్షోభాలతో సతమతమవుతోందన్నారు. బీజేపీని ఎదుర్కొనే విషయంలో ఎప్పటికప్పుడు తడబడుతోందని చెప్పారు. కాంగ్రెస్ వైఫల్యాల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ యునైటెడ్, తెలంగాణ రాష్ట్ర సమితి, ఆమ్ఆద్మీ పార్టీ దూకుడు పెంచాయన్న ఆయన బీజేపీకి అసలు సిసలైన ప్రత్యామ్నాయం మేమే కాగలమంటూ మమతా బెనర్జీ, నీతీశ్ కుమార్, కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలిపారు.
వీరి ప్రయత్నాలు ఫలిస్తే.. ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనే చర్చ విస్తృతంగా జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో.. మమత, కేజ్రీవాల్, కేసీఆర్‌లో ఎవరు బెటర్ అనే దానిపై ఆయన మాట దాటవేశారు. “అన్ని పార్టీల్ని ఏకం చేయగల, అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుడే.. ప్రధాన మంత్రి అభ్యర్థిగా సరైన వ్యక్తి” అని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates