అవును…! ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే మాట వినిపిస్తోంది. పార్టీ ఏదైనా.. నాయకుడు తన పద్ధతిని మార్చు కోకూడదనే సిద్ధాంతాన్ని ఆచరించి చూపించిన నేతగా.. గుర్తింపు పొందారు రెబల్ స్టార్ కృష్ణంరాజు. ప్రస్తుతం ఆయన మన మధ్యలేరు. కొన్ని గంటల కిందటే తుదిశ్వాస విడిచారు. ఒక్క సినీ రంగంలోనే కాకుండా.. రాజకీయంగా కూడా కృష్ణంరాజు తనదైన శైలిలో దూసుకుపోయారు. 1990లలో ఆయనకు తొలిసారి రాజకీయ అవకాశం వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఆహ్వానం పలికింది.
ఈ క్రమంలోనే ఆయన 1991లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి విజయం దక్కించుకున్నారు. నిగర్విగా.. నిరాడంబరుడిగానే కాదు.. ప్రజల నాయకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. వాస్తవానికి సినీ రంగంలో ఉన్నవారు చాలా బిజీగా ఉంటారు. దీంతో వారు రాజకీయంగా అరంగేట్రం చేసినా.. ప్రజలకు స్థిమితమైన సమయం ఇచ్చేందుకు అవకాశం ఉండదు. అయితే..దీనిని కృష్ణంరాజు మార్చేశారు.
“ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. మనం ఎంత బిజీగా ఉన్నామనేది వారికి అనవసరం. వారికి కూడా సమయం ఇవ్వాలి.” అని చెప్పిన ఆయన వారానికి రెండురోజులు ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉండే లా ప్లాన్ చేసుకుని..ప్రజలను మెప్పించారు. తర్వాత.. కాలంలో ఆయన కాంగ్రెస్‌తో విభేదించారు. సంపాయించుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చారంటూ.. కొందరు చేసిన విమర్శలను ఆయన సీరియస్‌గా తీసుకుని.. బయటకు వచ్చేశారు.
ఈ క్రమంలోనే 1998లో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుని కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి విజయం దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వాజపేయి ప్రభుత్వంలో మంత్రి గా చేశారు. అయితే.. ఈ సమయంలో ఆయన సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పడం గమనార్హం. అయితే.. తన గోపీ కృష్ణా కంబైన్స్ నిర్మాణ సంస్థ ద్వారా.. సినిమాలు.. సీరియళ్లు నిర్మించేందుకు ప్రాధాన్యం ఇచ్చారు.
అదే సమయంలో పార్టీలకు అతీతంగా నాయకులు ఎవరు తన వద్దకు వచ్చినా.. పనులు చేసి పెట్టారు. అందుకే.. కృష్ణం రాజు మృతి .. సినీ రంగానికే కాకుండా.. యావత్ రాజకీయ రంగానికి కూడా తీరనిలోటు అయిందనేది వాస్తవం. మరి ఇలాంటి నాయకులు మళ్లీ పుడతారా? అనేది వేచి చూడాలి
Gulte Telugu Telugu Political and Movie News Updates