ఔను.. ఇప్పుడు ఏపీ అధికార పార్టీలో నాయకులు చెబుతున్న మాట ఇదే! ప్రస్తుతం సీఎం జగన్ ఎంత ఆదేశించినా.. ఎన్ని సార్లు హెచ్చరించినా.. నాయకుల మధ్య చైతన్యం కలగడం లేదనేది అందరికీ తెలిసిందే. ఎక్కడికక్కడ నాయకులు సుప్తచేతనావస్థను వీడలేక .. నిద్రబద్ధకాన్ని వదిలించుకోలేక పార్టీలో చర్చనీయాంశంగా మారుతున్నారు. మీరు జనాల్లో ఉండకపోతే.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఉండదని.. సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు.
అయినప్పటికీ.. నాయకుల మధ్య చలనం పెద్దగా కనిపించడం లేదు. ఏదో కొద్దిమంది మాత్రమే.. అది కూడా మొక్కుబడిగా.. ప్రజల మధ్య ఉంటున్నారు. తాజాగా.. ఇదే విషయంపై పార్టీకి నివేదిక అందింది. నాయకులు..ఏదో మొక్కుబడిగా వ్యవహరిస్తున్నారని.. మనస్పూర్తిగా ఉండడం లేదేని.. ప్రజలకు నేతలకు మధ్య అదే గ్యాప్ కొనసాగుతోందని.. సమాచారం అందింది. దీంతో జగన్ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.
అయితే.. ఈ సారి ఆయన ఎలాంటి హెచ్చరికలు చేయాలని భావించడం లేదు. ఇప్పటి వరకు కదలని నాయకులను కదిలించే మంత్రం ఒకటి వేశారని.. అంటున్నారు. అదే.. ప్రజల్లో ఉన్న నాయకులు.. గడప గడపకు కార్యక్రమం చేపడుతున్న నాయకులకు.. చెందిన నియోజకవర్గాలకు.. ఈ నెల ఆఖరులో అభివృద్ధి నిధులు విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంటే.. ఆయా నియోజకవర్గాలకు రూ.2 కోట్ల వంతున ప్రభుత్వం ఇస్తుందన్నమాట.
ఇది.. గతంలో ప్రకటించిన విధానమే. అయితే.. అప్పట్లో అందరికీ ఈ నిధులు ఇస్తామని.. జగన్ ప్రకటన చేశారు. ప్రతిపక్ష నాయకుల నియోజకవర్గాలకు కూడా నిధులు ఇస్తామన్నారు. అయితే.. ఇప్పుడు.. వ్యూహం మార్చుకుని అందరికీ కాకుండా.. పనిచేసేవారికి మాత్రమే.. నిధులు ఇవ్వాలని.. నిర్ణయించిన ట్టు తాడేపల్లి వర్గాల టాక్. ఇది కనుక జరిగితే.. అప్పుడు ఇక, అందరూ… ముందుకు వస్తారని.. ప్రజల మధ్య ఉంటారని.. పైకి మాటలు ఎన్ని చెప్పినా.. ప్రయోజనం లేదని.. ఒకటాక్ వినిపిస్తుండడం గమనార్హం. మరి ఈ మంత్రం ఏమేరకు పనిచేస్తుందో చూడాలి.