కేసీయార్-మమత మధ్య పోటీ మొదలైందా ?

నాన్ ఎన్డీయే పార్టీలను ఏకం చేసే విషయంలో కేసీయార్-మమతా బెనర్జీ మధ్య పోటీ మొదలైనట్లే అనుమానంగా ఉంది. ఒకవైపు నాన్ ఎన్డీయే పార్టీల అధినేతలతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చాలా బిజీగా చర్చలు జరుపుతున్నారు. ఇదే సమయంలో కేసీయార్ జాతీయపార్టీని పెట్టి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆతృత పడుతున్నారు. ఇదే సమయంలో మమతాబెనర్జీ కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమవుతున్నారు.

నాన్ ఎన్డీయే పార్టీలను ఏకతాటిపైకి తేవటమే తన లక్ష్యమని నితీష్ ఇప్పటికే ప్రకటించారు. ప్రతిపక్షాల కూటమికి సారధ్య బాధ్యతలు తీసుకునే ఆలోచన తనకు లేదని బీహార్ సీఎం స్పష్టంగా ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీని ఓడించటమే తన టార్గెట్ గా నితీష్ చెప్పారు. ఇదే విషయాన్ని కేసీయార్, మమత కూడా చెబుతున్నా అంతర్లీనంగా నాన్ ఎన్డీయే పార్టీల కూటమికి నాయకత్వం వహించాలన్న కోరిక బలంగా వారిలో కనబడుతోంది.

ఇక్కడే ఈ ఇద్దరికీ మిగిలిన పార్టీలతో పాటు యూపీఏకి సమస్యలు వస్తున్నాయి. సమస్య ఏమిటంటే ఇద్దరు కూడా నమ్మదగ్గ నేతలుకారు. ఎప్పుడు ఎలాగుంటారో ? ఎవరితో చేతులు కలుపుతారో కూడా మిగిలిన వాళ్ళు ఊహించలేరు. కేసీయార్, మమత గతచరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోతుంది. తాజాగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత తేజస్వీయాదవ్ తో తాను చర్చలు జరిపానని మమత చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

హేమంత్ యూపీఏలో అధికారిక భాగస్వామి. యూపీఏ భాగస్వామి హోదాలో హేమంత్ ఎలాగూ బీజేపీకి వ్యతిరేకమే. ఇక ఈ సీఎంతో మమత కొత్తగా చర్చించేదేముంటుంది ? అలాగే బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టడంలో నితీష్ బిజీగా ఉన్నారు. అలాంటిది నితీష్ తో మమత కొత్తగా మాట్లాడేదేముంటంది ? ఇక కేసీయార్ కూడా ఇలాంటి ప్రకటనలే చేస్తున్నారు. కాబట్టి నాన్ ఎన్డీయే పార్టీల బృందానికి నాయకత్వం వహించే విషయంలో కేసీయార్, మమత మధ్య పోటీ మొదలైందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.