కోమటిరెడ్డి ఏమిచేస్తారో ?

మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ తరపున పోటీచేయబోయే అభ్యర్ధిని అధిష్టానం ప్రకటించింది. సీనియర్ నేత పాల్వాయ్ స్రవంతిని పార్టీ చీఫ్ సోనియాగాంధి ప్రకటించారు. అభ్యర్ధిగా స్రవంతిని కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరుకున్నట్లే ప్రకటించింది. అంటే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డేమో కృష్ణారెడ్డి అనే నేతను అభ్యర్ధిగా ప్రతిపాదించారు. ఇదే సమయంలో వెంకటరెడ్డేమో స్రవంతిని ప్రతిపాదించారు. సో వెంకటరెడ్డి ఛాయిస్ ప్రకారమే అధిష్టానం స్రవంతిని ఎంపికచేసింది.

అంటే కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించే బాధ్యత ఇపుడు ఎంపీ మీద పడింది. రేవంత్ కు వెంకటరెడ్డికి ఏమాత్రం పడటంలేదన్న విషయం అందరికీ తెలిసిందే. పీసీసీ చీఫ్ ప్రకారం కృష్ణారెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించుంటే వెంకటరెడ్డి ఏమిచేసేవారో తెలీదు. కానీ ఇపుడు అభ్యర్ధి తన ఛాయిస్ ప్రకారమే వచ్చారుకాబట్టి గెలుపించాల్సిన బాధ్యత ఎంపీపైనే ఎక్కువుంది. అయితే ఇక్కడ ఎంపీ సమస్య ఏమిటంటే బీజేపీ తరపున పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి స్వయానా తన తమ్ముడే.

పార్టీ ధర్మానికి కట్టుబడి వెంకటరెడ్డి స్రవంతి గెలుపుకు చిత్తశుద్దితో పనిచేస్తారా లేకపోతే రక్తసంబంధానికి కట్టుబడి సొంతపార్టీ అభ్యర్ధిని గాలికొదిలేసి తమ్ముడి గెలుపుకు సహకరిస్తారా ? అన్నది ఇపుడు ఆసక్తిగా మారింది. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంట్రస్టింగ్ పాయింట్ ఒకటుంది. అదేమిటంటే తమ్ముడు రాజగోపాలరెడ్డి గెలుపుకు సహకరించాలని తమను వెంకటరెడ్డి బాగా ఒత్తిడి పెడుతున్నట్లు మూడురోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలోని ద్వితీయశ్రేణి నేతలు కొందరు బాహాటంగానే ఆరోపించారు.

ద్వితీయ శ్రేణి నేతలు చేసిన ఆరోపణలపై ఇప్పటివరకు వెంకటరెడ్డి సమాధానం చెప్పలేదు. అందుకనే కొంతమంది నేతలు చేసిన ఆరోపణలు నిజమే అని ప్రచారం జరుగుతోంది. మరి తమ్ముడి గెలుపుకు సహకరించాలని నేతలపై ఒత్తిడి తెచ్చిందే నిజమైతే పట్టుబట్టి స్రవంతికి టికెట్ ఎందుకు తెచ్చుకున్నట్లు ? స్రవంతి అభ్యర్ధి అయితే తమ్ముడి గెలుపు ఈజీగా ఉంటుందని వెంకటరెడ్డి ప్లాన్ చేశారా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.