మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఖ‌రారు.. ఎవ‌రంటే!

తెలంగాణ‌లో తీవ్ర సంచ‌ల‌నంగా మారిన‌.. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌కు సంబంధించి కాంగ్రెస్ ముసుగు వీడిపోయింది. ఇప్ప‌టి వ‌ర‌కు నువ్వానేనా.. అన్న‌ట్టుగా ఉన్న ఇక్క‌డి నాయ‌కుల తీరుకు తెర‌దించుతూ.. కాంగ్రెస్ అధిష్టానం అభ్య‌ర్థిని ఖ‌రారు చేసింది. ఆది నుంచి ఇక్క‌డ పోటీకి.. న‌లుగురు కీల‌క నాయ‌కులు రంగంలో ఉన్నారు. దీంతో అభ్య‌ర్థిని ఖ‌రారు చేయ‌డం స్థానిక నాయ‌క‌త్వానికి క‌త్తిమీద సాములాంటి ప‌రిణామ‌మే ఎదురైంది.

ఈ నేప‌థ్యంలో ఆశావ‌హుల జాబితాను అధిష్టానానికి పంపించారు. ఈ క్ర‌మంలోతాజాగా మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి పేరు ఖరారైంది. దీనిపై ఏఐసీపీ ప్రకటన చేసింది. కొద్దిమంది ఆశావహులతో పాటు స్థానికంగా బలంగా ఉన్న మరో నేత కృష్ణారెడ్డి తీవ్రంగా ప్రయత్నించినా టికెట్ మాత్రం పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురినే వరించింది.

మ‌రోవైపు.. మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధించి రానున్న అసెంబ్లీ ఎన్నికలకు సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్లాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అభ్యర్థి ప్రకటన కూడా ఖ‌రారు కావ‌డంతో ప్రచారాన్ని మ‌రింత దూకుడుగా ముందుకు తీసుకువెళ్లాల‌ని నిర్ణ‌యించింది. నాయకుల మధ్య విబేధాలు లేవని ఐక్యంగా ఉన్నామనే సంకేతాలను పార్టీ శ్రేణుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగానే టీఆర్ ఎస్‌, బీజేపీ వైఫల్యాలపై మునుగోడులో మ‌రింత ప్ర‌చారం ముమ్మ‌రం చేయ‌నున్నారు. నాయకులంతా కలిసికట్టుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే బాధ్యతను ఏఐసీసీ ఇన్‌ఛార్జి కార్యదర్శులు తీసుకున్నారు. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌, ఛార్జీషీట్‌లోని అంశాలను గడపగడపకు తీసుకెళ్లాలని మండల ఇన్‌ఛార్జీలను పీసీసీ ఆదేశించింది. ఇందుకు అవసరమైన ప్రచార కరపత్రాలను భారీగా సిద్దం చేసింది.

మన మునుగోడు-మన కాంగ్రెస్‌ అన్న నినాదంతో ఓటర్లను కలుసుకుంటూ టీఆర్ఎస్‌, బీజేపీల వైఫల్యాలను వివరించ‌నున్నారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడారని… అందుకోసమే ఉపఎన్నిక వచ్చిందని వివరించాల‌ని ఇప్ప‌టికే నిర్ణ‌యించారు. మొత్తానికి అభ్య‌ర్థి పాల్వాయి స్ర‌వంతికి స్థానికంగా ప‌ట్టుండ‌డం.. టీఆర్ఎస్‌లోనూ.. లోపాయికారీగా.. అండ‌దండ‌లు ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.