టార్గెట్ టీడీపీ.. కాదు కాదు.. ఐ-టీడీపీ!

రాజ‌కీయాల్లో వ్యూహాలు మారడం స‌హ‌జ‌మే. కానీ అవి ప్ర‌జ‌ల‌కు మేలు చేసేలానో.. రాష్ట్రానికి మేలు చేసేలా నో ఉండాలి. కానీ, ఇప్పుడు.. ఏపీలో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ గొంతు నుల‌మ‌డ‌మే ల‌క్ష్యంగా అధికార పార్టీ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంద‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుతం టీడీపీలో కొంద‌రు నేత‌లు మాత్ర‌మే మీడియా ముందుకు వ‌స్తున్నారు. మ‌రికొంద‌రు మాత్ర‌మే క్షేత్ర‌స్థాయిలో ఉంటున్నారు. కానీ, చాలా మంది ఎక్క‌డ ఉన్నా.. ఏం చేస్తున్నా.. టీడీపీ త‌ర‌ఫున ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గ‌ళం వినిపిస్తున్నారు.

దీనికివారు.. టీడీపీ ఐటీ విభాగాన్ని ద‌న్నుగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. అయితే.. ఇప్పుడు ఈ ఐ-టీడీపీ వింగ్‌పైనే వైసీపీ స‌ర్కారు ఉక్కుపాదం మోపుతోంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కేవలం 24 గంటల్లో చోటు చేసుకున్న ప‌రిణామాలు.. రాష్ట్రంలో తీవ్ర క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఎంపీ గోరంట్ల మాధవ్‌కు సంబంధించి మార్ఫింగ్ వీడియో సృష్టించి, సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేశారన్న ఫిర్యాదుపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఐ టీడీపీ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతా, అనుబంధ ఖాతాలతో పాటు యూకే ఫోన్ నెంబర్ ఉన్న తెలుగుదేశం వాట్సప్ గ్రూపు, ఎలక్ట్రానిక్ మీడియా సామాజిక మాధ్యమ ఖాతాలపై.. నేరపూరిత కుట్ర, ఫోర్జరీ కింద అభియోగాలు మోపింది.

గోరంట్ల మాధవ్ ఫిర్యాదుతో ఐపీసీలోని వివిధ సెక్షన్లు సహా ఐటీ చట్టంలోని సెక్షన్ 66సీ కింద కేసు రిజిష్టర్ చేసింది. ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్నంగా ఓ మహిళతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు వీడియో వెలుగు చూశాక .. దానిపై సమగ్ర విచారణ జరిపించాలని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు డీజీపీని ఆదేశించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని అఖిలపక్ష మహిళా నాయకులు డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటిదాకా కేసు లేదు, దర్యాప్తూ లేదు. కానీ, ఎంపీ ఫిర్యాదుతో ఐ-టీడీపీపై కేసు పెట్టారు.

అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే పద్మావతిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారన్న అభియోగంపై ఐ-టీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనూషకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఏలూరులోని ఆర్ఆర్ పేటలో ఆమె వస్త్ర దుకాణానికి వచ్చిన అనంతపురం పోలీసులు.. 41ఏ నోటీసులు ఇచ్చారు. మూడు రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని, లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. పద్మావతిపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ భీమిశెట్టి శ్రీనివాసులు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో శింగనమల పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.