జాతీయం సరే…రాష్ట్ర రాజకీయాల సంగతేంటి కేసీఆర్?

గత కొద్ది రోజులుగా ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ అంటూ బీజేపీ వ్యతిరేక పార్టీల అధినేతలతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అవుతోన్న సంగతి తెలిసిందే. థర్డ్ ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనుందని కేసీఆర్ చెబుతున్నారు. మరోవైపు, రైతుల సపోర్ట్ తో జాతీయ స్థాయిలో రైతు పార్టీ పెట్టే యోచనలో కేసీఆర్ ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్న కేసీఆర్…తెలంగాణ రాజకీయాలపై దృష్టిపెట్టాలంటూ విపక్ష పార్టీల నేతలు చురకలంటిస్తున్నారు.

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడకేం కాదని, బీజేపీ, కాంగ్రెస్ ల నుంచి అధికార పార్టీకి గట్టిపోటీ తప్పదని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంట గెలిచి రచ్చ గెలవాలి…అన్న సామెత తెలంగాణ సీఎం కేసీఆర్ కు కాస్త లేటుగా అయినా గుర్తొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాల పర్యటనలలో పైకి జాతీయ పార్టీపై ప్రకటనలు చేస్తున్నా…రాష్ట్ర రాజకీయలపై కూడా కేసీఆర్ ఫోకస్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

2024 సార్వత్రిక ఎన్నికలు, ఫెడరల్ ఫ్రంట్ కంటే ముందే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి కేసీఆర్ ను తాకనుంది. తెలంగాణ ఇంట జరిగే ఆ ఎన్నికల్లో గెలవకుంటే…జాతీయ స్థాయిలో ఫెడరల్ రచ్చ గెలవలేమని కేసీఆర్ అనుకుంటున్నారట. తెలంగాణలో అధికారం కోల్పోతే దేశ రాజకీయాలలో తనను ఎవరూ పట్టించుకోరన్న ఆలోచనకు కేసీఆర్ వచ్చారట. అందుకే, ముచ్చటగా మూడో సారి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నారట.

అయితే, ఈ సారి బీజేపీ మత రాజకీయాలను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం సాగించాలని కేసీఆర్ అనుకుంటున్నారట. తెలంగాణకు బీజేపీ వీసమెత్తు సాయం కూడా చేయలేదని, పైగా మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోందన్న యాంగిల్ లో కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లబోతున్నారట. అంతేకాదు, తెలంగాణలో కచ్చితంగా ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తేనే…2024 సార్వత్రిక ఎన్నికలలో తాడోపేడో తేల్చుకోవచ్చని భావిస్తున్నారట.