బీజేపీ ట్రాపులో కేసీఆర్?

క్యాబినెట్లో తీసుకున్న ఒక నిర్ణయం చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానం పెరిగిపోతోంది. శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న అనేక నిర్ణయాల్లో సెప్టెంబర్ 16,17,18 తేదీల్లో తెలంగాణా విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరిపించాలనేది కీలకమైనది. దీనికే జాతీయ సమైక్యతా దినోత్సవమని ముద్దుగా పేరుపెట్టారు. విమోచన దినోత్సవం అనేది ప్రత్యేక తెలంగాణా ఉద్యమం నుండి వినబడుతున్నదే.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నపుడు జరిగిన ఉద్యమంలో తెలంగాణా విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరపటం లేదని స్వయంగా కేసీఆర్ వందలసార్లు డిమాండ్ చేసుంటారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని కేసీయార్ ఎన్నో సార్లు ప్రకటించారు. మరి ప్రత్యేక తెలంగాణ ఏర్పడి, టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి ఎనిమిదన్నరేళ్ళు అవుతున్నా అప్పటి డిమాండ్ ఏది ? అప్పటి హామీ ఏది ?

అధికారంలోకి రాగానే కేసీఆర్ విమోచన దినోత్సవాన్ని కన్వీనియంట్ గా పక్కనపడేశారు. మిత్రపక్షం ఎంఐఎం అభ్యంతరాల కారణంగా విమోచనదినోత్సవాన్ని జరపకూడదని కేసీఆర్ అనుకున్నారు మానేశారంతే. ఇపుడు హఠాత్తుగా విమోచన దినోత్సవాన్ని మూడురోజులు ఘనంగా ఎందుకు జరపాలని అనుకుంటున్నట్లు? ఎందుకంటే బీజేపీ ఒత్తిడిని తట్టుకోలేకే. విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ జరపకపోతే కేంద్ర హోంశాఖే అధికారికంగా జరుపుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. బీజేపీది నూరుశాతం ఎన్నికల స్టంటని తెలుస్తునే ఉంది. నిజానికి తెలంగాణా విమోచన దినోత్సవం జరిపినా జరపకపోయినా ఒకటే.

జనాలకు కావాల్సింది మంచి వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం, విద్య, వైద్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ఇవి లేకుండా ఎన్ని విమోచన దినోత్సవాలు జరిపినా ఉపయోగం ఏముంటుంది? అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ నానా గోల చేస్తోంది. కేంద్ర హోంశాఖ నిజంగానే విమోచన దినోత్సవం జరిపితే కేసీయార్ కు అవమానమనే చెప్పాలి. ఎందుకంటే చూస్తు కూర్చోలేరు అలాగని అడ్డుకోనూ లేరు. అందుకనే క్రెడిట్ బీజేపీకి ఎందుకివ్వాలని అనుకున్నట్లున్నారు. వెంటనే తెలంగాణా విమోచన దినోత్సవం అంటు ప్రకటించేశారు.