పనితీరు మార్చుకోని నియోజకవర్గాల ఇన్చార్జీలు, నేతలపై చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని చంద్రబాబు నాయుడు సీరియస్ గా చెప్పారు. నిర్ణయాలు తీసుకునే సమయం వచ్చేసిందని ఇపుడు కూడా కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే ఉపయోగం ఉండదని చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు అందరికీ. నేతలు క్రియాశీలం అవుతారేమో అని మూడున్నరేళ్ళు ఎదురుచూసినా ఉపయోగం కనబడలేదని తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
తాను నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న విషయం గుర్తు చేస్తునే కార్యకర్తలు కూడా పార్టీ ఇచ్చిన పిలుపుకు బాగా స్పందిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. అయితే మధ్యలో ఉన్న కొందరు ఇన్చార్జిలు, నేతలు మాత్రం పూర్తి అలసత్వంతో వ్యవహరిస్తున్నారంటు మండిపోయారు. పార్టీ ఇచ్చే పిలుపును, అమలు చేయాలని అనుకుంటున్న కార్యక్రమాలను కొందరు నేతలు ఉద్దేశ్యపూర్వకంగానే అమలు చేయటం లేదని ధ్వజమెత్తారు.
గతంలో ఇచ్చిన హామీ మేరకు యువతకు 40 శాతం టికెట్ల కేటాయింపుకే తాను కట్టుబడున్నట్లు పార్టీ సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరు పోరాడాలని, అవసరమైతే కేసులు పెట్టించుకుని జైలుకు వెళ్ళాలని కూడా సూచించారు. జగన్ ప్రభుత్వంపై పోరాటాలు చేసి కేసులు పెట్టించుకుని, జైలుకు వెళ్ళొచ్చిన వారిని పార్టీ ఎప్పటికీ మరవదని స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు తాజాగా మాట్లాడిన మాటలు, చేసిన హెచ్చరికలను చూసిన తర్వాత తొందరలోనే కొన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జీలను మార్చేస్తారనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఒకవైపు కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్ధులను ఇఫ్పటికే ప్రకటించేశారు. మరికొన్ని నియోజకవర్గాలకు ఇన్చార్జీలను నియమించారు. ఇన్చార్జీలుగా నియమించారంటే దాదాపు అభ్యర్థిగా ప్రకటించినట్లే అనుకోవాలి. కాకపోతే ఇంచార్జ్ హోదాలో సదరు నేత పనితీరును చంద్రబాబు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. పనితీరు ఏ మాత్రం సంతృప్తికరంగా లేదనిపిస్తే మాత్రం చివరలో అభ్యర్ధిగా ఇంకో నేత వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా వచ్చే ఎన్నికలు టీడీపీకి జీవన్మరణ సమస్యగా మారింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తేనే భవిష్యత్తు. అందుకనే అభ్యర్ధులను, ఇన్చార్జిల నియమాకంపై చంద్రబాబు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates