చిరు తరువాత ఎన్టీఆర్‌ను తగులుకున్న నారాయణ

తెలుగు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు పార్టీలు, వాటి నేతలు ప్రాధాన్యం కోల్పోయి చాలా కాలం అయింది. ఆ పార్టీలు, వాటి నేతలు నామమాత్రంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఐతే సీపీఐ నేత నారాయణ రాజకీయంగా అంతగా క్రియాశీలంగా లేకపోయినా సరే.. తన నోటి దురుసుతో తరచుగా వార్తల్లో నిలిచే ప్రయత్నం చేస్తుంటారు. రాజకీయ పార్టీలు, నేతల విషయంలో ఆయన ఏం మాట్లాడినా చెల్లిపోతూ వచ్చింది కానీ.. ఇటీవల అకారణంగా మెగాస్టార్ చిరంజీవిని దూషించడంతో విమర్శల సుడిగుండంలో చిక్కుకున్నాడాయన.

చాలా ఏళ్ల కిందటే రాజకీయాలు వదిలేసి, సినిమాలకు పునరంకితమై, వివాదాలకు దూరంగా ఉంటూ మర్యాదరామన్న పాత్ర పోషిస్తున్న చిరును ఉద్దేశించి ‘చిల్లర బేరగాడు’ అనే మాట వాడి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు నారాయణ. భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణకు ప్రధాని.. చిరును ఆహ్వానించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. నారాయణ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం, చిరు అభిమానులతో పాటు కాపు సంఘాల నేతలు, జనసేన మద్దతుదారులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడడంతో నారాయణకు దిక్కు తోచలేదు.

దీంతో మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి లెంపలు వేసుకున్నారాయన. ఈ సందర్భంగా నారాయణ చేతులెత్తి నమస్కరించిన తీరు చూస్తే చిరు అభిమానుల దెబ్బ మామూలుగా లేదని అర్థమైంది. ఆ తర్వాత అయినా నారాయణ ఇలాంటి విమర్శలు తగ్గించుకుంటారేమో అనుకుంటే.. అలా ఏమీ చేయలేదు. ఈసారి ఆయన మరో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను టార్గెట్ చేశారు. ఇటీవల హోం మంత్రి అమిత్ షా పిలుపు అందుకుని ఆయన్ని ఎన్టీఆర్ కలవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

నరేంద్ర మోడీ గుజరాత్ ప్రధానిగా ఉన్న సమయంలో అమిత్ షా పెద్ద స్మగ్లర్ అని.. అలాంటి వ్యక్తి పిలిస్తే ఒక గౌరవప్రదమైన కుటుంబానికి చెందిన ఎన్టీఆర్ వెళ్లి కలవాల్సిన అవసరం ఏంటని నారాయణ ప్రశ్నించారు. ఐతే చిరును దూషించినట్లు తారక్‌ను నారాయణ దూషించనప్పటికీ.. అతణ్ని తప్పుబట్టడం అభిమానులకు రుచించట్లేదు. దేశ ప్రధాని తర్వాత అత్యంత పవర్ ఫుల్ లీడర్ అయిన అమిత్ షా ఆహ్వానిస్తే తారక్ వెళ్లి కలవడం అతడిక ప్లస్సే తప్ప మైనస్ ఏమీ కాదు. దీనిపై నారాయణ విమర్శలు చేయడమేంటంటూ ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్.