మునుగోడులో పొలిటిక‌ల్ గ‌ణ‌నాథులు

ఎంతైనా.. మ‌న నాయ‌కులు.. నాయ‌కులే! ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు.. త‌మ‌కు అనుకూలంగా ఓట్లు వేయించుకునేందుకు ఉన్న ఏ చిన్న అవ‌కాశాన్నీ వారు వ‌దులుకునే ప‌నేలేదు. ఈ క్ర‌మంలో తాజాగా ఉప ఎన్నిక‌కురెడీ అవుతున్న ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలోని మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం కూడా దీనికి ఏమాత్రం తీసిపోలేదు. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్న వినాయ‌చ‌వితిని ఇక్క‌డ నాయ‌కులు రాజ‌కీయం చేసేశారు. యువ‌త‌ను స‌మీక‌రించ‌డం నుంచి నాలుగు రోడ్ల కూడ‌ళ్ల‌లో పందిళ్లు వేయ‌డం వ‌ర‌కు.. ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ దాకా అంతా కూడా పొలిటిక‌ల్ మ‌యం అయిపోవ‌డం గ‌మ‌నార్హం.

వారు వీరు అనే తేడా లేకుండా.. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నాయ‌కులు మునుగోడులో చ‌వితి వేడుకల‌ను రాజ‌కీయం చేయ‌డం గ‌మ‌నార్హం.  గణేశ్‌ ఉత్సవాలు ప్రత్యేకించి యువత ఆధ్వర్యంలోనే ఎక్కువగా నిర్వహిస్తుండడంతో.. ఉప ఎన్నిక దృష్ట్యా రాజకీయ పార్టీలు వారిని ఆకట్టుకునేందుకు భారీగా ఖర్చు చేస్తున్నాయి. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే కమిటీలకు.. విగ్రహం కొనుగోలుకు అయ్యే మొత్తంతోపాటు నవరాత్రులు ముగిసేంత వరకు మండపాల నిర్వహణకు అయ్యే ఖర్చునూ అధికార టీఆర్‌ఎస్‌ నేత ఒకరు అందజేస్తున్నారు.

మరోవైపు బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు సైతం ఆయా మండపాల నిర్వహణ కోసం డబ్బులు ఇస్తున్నారు. నియోజకవర్గంలోని చౌటుప్పల్‌ మునిసిపాలిటీ పరిధిలో 150 వినాయక విగ్రహాల ఏర్పాటుకుగాను ఒక్కో కమిటీకి రూ.10 వేల చొప్పున టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ జరిగినట్లు తెలిసింది.  చౌటుప్పల్‌ మార్కెట్‌ యార్డులో వీటిని పంపిణీ చేసినట్లు సమాచారం. దీంతోపాటు చౌటుప్పల్‌ మండలంలోని గ్రామాల్లోనూ 300 విగ్రహాలు, ఉత్సవాల నిర్వహణకు సైతం రూ.10 వేల చొప్పున అందజేసినట్లు తెలిసింది.

మర్రిగూడ, నాంపల్లి, చండూరు, గట్టుప్పల్‌, మునుగోడు, నారాయణపురం మండలాల్లో టీఆర్ ఎస్‌తో  పాటు బీజేపీ, కాంగ్రెస్‌ కూడా వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి కూడా మునుగోడు మండలంతోపాటు నియోజకవర్గంలోని పలు మండలాల్లో పెద్దఎత్తున వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు.

ఈయన కూడా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పంపిణీ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక బీజేపీ నేత రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత చల్లమల్ల కృష్ణారెడ్డి కూడా తమను కలిసిన గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యులకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు ఇస్తున్నట్లు సమాచారం. మొత్తానికి పండ‌గ మీది.. ఖ‌ర్చు మాది.. అని నాయ‌కులు.. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు.. వినాయ‌చ‌వితిని బాగానే వాడుకుంటున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.