బాబు కొంచెం దృష్టి పెడితే

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఒక‌ప్పుడు ఉన్న ప‌రిస్థితి ఇప్పుడు లేదు. అంతా బాగానే ఉంది.. వ్య‌తిరేక మీడియా క‌ల్పిత క‌థ‌నాల‌తో పార్టీని పాడు చేస్తోంద‌ని.. అధికారంలో ఉన్న‌ప్పుడు.. చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెప్పేవారు. పైగా.. ప్ర‌జ‌ల్లో పార్టీకి.. ప్ర‌భుత్వానికి కూడా.. సానుకూలత 80 శాతం ఉంది.. 85 శాతం ఉంది.. అంటూ.. ఆయ‌న ప్ర‌చారం చేసుకునేవారు. అయితే.. వాస్త‌వాన్ని మాత్రం ఆయ‌న ప‌ట్టించుకునేవారు కాద‌నే టాక్ వినిపించింది. స‌రే.. గ‌త ఎన్నిక‌ల్లో ఇలాంటి ప‌రిణామాల నేప‌థ్యంలో ఎలాంటి ఫ‌లితాన్ని టీడీపీ చ‌వి చూసిందో.. అంద‌రికీ తెలిసిందే.

అయితే.. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయి.. మూడేళ్లు అయిపోయింది. ఈ మూడేళ్ల కాలంలో పార్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంద‌నేది వాస్త‌వం. పైన ఓవ‌ర్ హెడ్ ట్యాంక్‌లాగా.. చంద్ర‌బాబు ఉత్సాహంగా ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల ప‌రిస్థితి మాత్రం మునిసిప‌ల్ ట్యాపుల మాదిరిగా త‌యారైంది. ఎప్పుడు వారు పార్టీకి అనుకూలంగా మాట్లాడ‌తారో.. ఎప్పుడు ప్ర‌జ‌ల్లో ఉంటారో.. ఎప్పుడు.. పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారో.. అనేది.. నాయ‌కుల చిత్తానుసార‌మే.. అన్న‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది.

ఇది.. ఇత‌ర జిల్లాల్లో ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. టీడీపీకి కంచుకోట‌ల వంటి.. అనంత‌పురం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ప‌రిస్థితి ఇలానే ఉండ‌డంగ‌మ‌నార్హం. వాస్త‌వానికి ఈ మూడు జిల్లాల్లోనూ.. 48 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా 7 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లోనూ ఇప్ప‌టికీ.. క్యాడ‌ర్ అయితే.. బాగానే ఉంది. కానీ, కావాల్సింద‌ల్లా.. వీరిని న‌డిపించే క్షేత్ర‌స్థాయి నాయ‌క‌త్వ‌మే. కానీ, అదే ఇప్పుడు బ‌ల‌హీనంగా ఉంది. గెలిచిన వారు.. ఓడిన వారిని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఓడిన వారు కేడ‌ర్‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు.

మొత్తంగా.. గెలిచిన వారు.. ఓడిన వారు కూడా.. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకుంటున్న దాఖాల అయితే.. క‌నిపించ‌డం లేదు. దీంతో బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ పాగా వేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పాగా వేసిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనిని టీడీపీ నాయ‌కులు లైట్ తీసుకున్నారు. జ‌గ‌న్ సునామీతో వీటిలో విజ‌యం ద‌క్కించుకున్నార‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌దే విజ‌య మని.. లెక్క‌లు వేసుకున్నారు.

కానీ, ఇప్పుడు అవే నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ మ‌రింత వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇది టీడీపీకి ఇబ్బందిగా మార‌డం ఖాయ‌మ‌ని.. ఆ పార్టీ సానుభూతి ప‌రులు చెబుతున్నారు. సో.. ఇప్ప‌టికైనా.. చంద్ర‌బాబు ఆయా జిల్లాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెడితే త‌ప్ప‌.. ప‌రిస్థితి బాగుప‌డ‌ద‌ని అంటున్నారు. మరి బాబు ఏం చేస్తారో చూడాలి.