వైసీపీ స‌ర్కారుకు ఎదురుదెబ్బ

ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వానికి హైకోర్టులో గ‌ట్టి ఎదురు దెబ్బ‌త‌గిలింది. గ‌తంలో ప్ర‌తిప‌క్షాలు స‌హా ప్ర‌జాస్వామ్య వాదులు.. స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఏం చెప్పాయో.. ఇప్పుడు అక్షరాలా.. హైకోర్టు కూడా అదే చెప్పింది. రాజ‌కీయ వ్యూహంలో భాగంగా అమ‌లు చేసిన కొన్ని ప‌థ‌కాల‌పై హైకోర్టు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన రెండేళ్ల‌కు జ‌గ‌న‌న్న ఇళ్ల కాల‌నీల పేరుతో.. రాష్ట్ర వ్యాప్తంగా పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాల‌ను కేటాయించింది. అయితే.. వీటిని ఎక్క‌డ బ‌డితే.. ఇక్క‌డ‌.. అవి చెరువులు కుంట‌లు కావ‌డంతో ఎందుకూ ప‌నికిరావ‌ని.. ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేక‌త వ‌చ్చింది.

అదేవిధంగా విప‌క్షాలు కూడా ఇలాంటివి ఇచ్చేది ఎందుక‌ని ప్ర‌శ్నించాయి. మ‌రీ ముఖ్యంగా శ్మ‌శాన స్థ‌లాల‌ను ఇళ్ల‌కు కేటాయించడంపై మ‌రింత మండిప‌డ్డాయి. అయిన‌ప్ప‌టి.. ప్ర‌భుత్వ పెద్ద‌లు ఎదురు దాడి చేశారు. పేద‌ల‌కు సెంటు బూమి ఇస్తుంటే రాజ‌కీయాలు చేస్తున్నారంటూ.. విమ‌ర్శ‌లు గుప్పించారు. వాస్త‌వానికి ప్ర‌భుత్వం కేటాయించిన స్థ‌లాలు.. చిన్న‌పాటి వ‌ర్షానికే చెరువుల్లా మారుతున్నాయి. అదేస‌మ‌యంలో వాటిలో నివాస‌యోగ్యంగా ఉన్న‌వి చాలా చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఆయా స్థ‌లాల‌ను కేటాయించి.. చాలా రోజులు అయినా.. ఎవ‌రూ వాటిలో ఇళ్లు క‌ట్టుకునేందుకు ముందుకు రాలేదు.

ఇప్పుడు హైకోర్టు కూడా ఇదే ప్ర‌శ్నించింది. ఎస్సీ శ్మశాన వాటికల్లో ఇళ్ల నిర్మాణాల అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. నవరత్నాల్లో భాగంగా ఎస్సీ శ్మశాన వాటికల్లో ప్రభుత్వం జ‌గ‌న‌న్న ఇళ్లు కేటాయించింది. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో కపిలేశ్వరం వాసి యాకోబు పిల్‌ దాఖలు చేశారు. శ్మశాన వాటికల్లో ఇళ్ల కేటాయింపు దారుణమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఎస్సీ శ్మశాన వాటికల్లో ఆర్బీకేలు, జగనన్న ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.

అంతేకాదు.. పేద‌లే క‌దా.. అని ఎక్క‌డ బ‌డితే అక్క‌డ స్థ‌లాలు కేటాయించి.. వారి మ‌నోభావాలు దెబ్బ‌తీయ‌డం స‌రికాద‌ని వ్యాఖ్యానించింది. పేద‌ల‌కు కూడా గౌర‌వంగా జీవించే హ‌క్కును రాజ్యాంగం ప్ర‌సాదించింద‌న్న‌.. విష‌యాన్ని ప్ర‌బుత్వం గుర్తించాల‌ని పేర్కొంది. దీంతో ఈ విష‌యం వివాదంగా మారింది. దీనిపై ప్ర‌భుత్వం ఏం చేస్తుందో చూడాలి. శ్మ‌శానాల్లో కేటాయించిన ఇళ్ల‌ను ర‌ద్దు చేసి.. వేరే చోట కేటాయించాల్సి ఉంటుంది. మ‌రి ఆ మేర‌కు స్థ‌లాలు ఉన్నాయా? అనేది ప్ర‌శ్న‌.

రాజ‌ధాని భూముల‌పైనా..

రాజధానిలో వేరే వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిగింది. మాస్టర్ ప్లాన్, జోనల్ రెగ్యులేషన్స్‌, సీఆర్‌డీఏ భూ కేటాయింపుల విధానానికి విరుద్ధంగా స్థలాలు కేటాయిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. రాజధాని రైతుల నష్టపరిహారంపై దాఖలు చేసిన పిటిషన్పై కూడా హైకోర్టు విచారణ జరిపింది. దీనికి సంబంధించిన అంశంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై రిజాయిండర్‌ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని న్యాయవాది కోరారు. రాజధానిపై వేసిన పిటిషన్‌లతో కలిపి వీటిని విచారించాలన్నారు.