వైసీపీ అధినేత సీఎం జగన్ తన మంత్రి వర్గంలో మరోసారి ఛాన్స్ ఇచ్చిన మంత్రుల్లో ఉన్నత విద్యావంతుడు.. డాక్టర్ సీదిరి అప్పలరాజు ఒకరు. ఆయన రాజకీయాలకు కొత్తే అయినా.. పెద్దగా సీనియర్ కాకపోయినా.. ఎంతోమంది సీనియర్లను.. పార్టీ జెండాను భుజాన వేసుకుని ఆది నుంచి పనిచేసిన వారిని కూడా పక్కన పెట్టి.. సీఎం జగన్.. సీదిరికి మంత్రి పదవి ఇచ్చారు. ఇది రాజకీయంగా వివాదానికి దారితీసినప్పటికీ.. జగన్ పట్టించుకోలేదు. పశుసంవర్థక శాఖను అప్పగించారు.
అయితే.. ఇదేమీ తీసిపారేయాల్సిన శాఖేమీ కాదు. సీఎం జగన్ అమలు చేస్తున్న జగనన్న పాల వెల్లువ వంటి కీలక పథకాలకు ఈ శాఖ కీలకంగా మారింది. అదేసమయంలో రాష్ట్రంలో అనేక సంచలనాలకు కూడా వేదికగా మారేలా.. శాఖను తీర్చిదిద్దే ఛాన్స్ ఉంది. గతంలో కాంగ్రెస్ హయాంలో సీనియర్ నాయకుడు మండలి బుద్ధ ప్రసాద్ ఈ శాఖ మంత్రిగా పనిచేశారు. అతి తక్కువ కాలమే ఆయన పదవిలో ఉన్నా.. విదేశాల్లో తిరిగి.. కొత్త సంస్కరణలు తీసుకువచ్చారు.
ఈ తరహాలో అనేక సంస్కరణలకు.. తక్కువ ధరలకే పాలు అందించేందుకు.. యువతకు ఉపాధి చూపించేందుకు మార్గాలు ఉన్నాయి. కానీ, మంత్రి సీదిరి మాత్రం ఈ విషయాలపై దృష్టి పెట్టడం లేదు. పైగా.. ఆయన రాష్ట్రంలో పెద్దగా పర్యటించిన సందర్భాలు కూడా లేదు. పాడి పరిశ్రమకు కేంద్రంగా ఉన్న ప్రకాశం జిల్లా నుంచి సీమ వరకు.. ఆయన ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పర్యటించి.. అక్కడ ఏం జరుగుతోందనే విషయాలపై దృష్టి కూడా పెట్టలేదు.
కేవలం నియోజకవర్గానికి మాత్రమే సీదిరి పరిమితం అవుతున్నారని సొంత పార్టీ నాయకులే అంటున్నారు. నియోజకవర్గంపై ఉన్న దృష్టి.. రాష్ట్రంపై పెట్టడం లేదని.. ప్రతిపక్ష నేతలు కూడా అంటున్నారు. ఈ పరిణామాలతో సీదిరి గ్రాఫ్ పెరగకపోగా.. ఆయన నియోజకవర్గ మంత్రి అనే వ్యంగ్యాస్త్రాలు వస్తున్నాయి. అంతేకాదు.. పోలీసులపై దూకుడు.. తిరుమల పర్యటనలు… సోదరుడితో కలిసి.. సముద్రంలో చేపల వేట వంటివాటికే ఆయనపరిమితం అవుతున్నారని.. విమర్శలు వస్తున్నాయి. మరి ఆయన ఇప్పటికైనా మారతారా? మంత్రిగా తనను తాను నిరూపించుకుంటారా? అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates